టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి కేంద్రంగా సాగుతున్న స్వార్థ రాజకీయాలకు తెరపడినట్టేనా? అంటే…అది టీడీపీ చేతల్లో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా తన కుటుంబ సభ్యులపై లోకేశ్ సోషల్ మీడియా వేదికగా దూషణల పర్వానికి దిగడంతో, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెలరేగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయిన వంశీ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో లోకేశ్ మాతృమూర్తి భువనేశ్వరిపై పొరపాటున నోరు జారానని ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.
భువనేశ్వరితో పాటు తన వ్యాఖ్యలతో బాధపడిన వాళ్లందరికీ వంశీ క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కలుషితం చేసిన దూషణలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భువనేశ్వరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులకు వంశీ క్షమాపణలు చెప్పడాన్ని ఆయన మెచ్చుకున్నారు.
ఇదే సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సతీమణిని అసెంబ్లీలో దూషించారని వెక్కివెక్కి ఏడ్వడాన్ని నారాయణ తప్పు పట్టారు. చంద్రబాబు ఏడ్చకుండా హుందాగా వ్యవహరించి వుంటే బాగుండేదని బాబుకు మిత్రుడైన నారాయణ హితవు చెప్పడం విశేషం. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు అన్యాయంగా ఉందన్నారు. ఇది దురదృష్టకర మన్నారు. కుటుంబ పెద్దగా వ్యవహరించి అసెంబ్లీలో సభ్యుల్ని అదుపులో పెట్టాల్సి ఉండిందన్నారు.
కానీ తమ్మినేని అలా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం నారాయణ నైజం. ఈ క్రమంలో కొన్ని సార్లు తన పార్టీ పెద్దల నుంచి తలంటించుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. మొత్తానికి వంశీ క్షమాపణలను స్వాగతించడంతో పాటు బాబును ఆయన స్నేహితుడే తప్పు పట్టడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.