సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనను తిడుతున్నా, కనీసం వేటు వేయని దుస్థితి. ఒకవైపు తాను వైసీపీలోనే వున్నానని చెబుతూ, మరోవైపు ఎల్లో మీడియాను వేదికగా చేసుకుని జగన్ పాలనను తూర్పారపడుతుంటే చేష్టలుడిగి, తాను అధికార పార్టీనా లేక ప్రతిపక్ష పార్టీనా అనే అనుమానాలు కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి మిత్రుడైన డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి గతంలో మైదుకూరు నుంచి ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్ర విభజన డీఎల్ రాజకీయ భవిష్యత్‌ను అంధకారంలో పడేసింది. మొదటి నుంచి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా డీఎల్ రాజకీయాలు నడిపారు. గతంలో వైఎస్ జగన్‌పై కడప పార్లమెంట్ స్థానం నుంచి డీఎల్ తలపడి డిపాజిట్ కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఘనత డీఎల్‌కే చెల్లు.
అయితే 2014లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌కు మద్దతు పలికారు. టీడీపీలోనూ ఆయన ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయారు. పుట్టాతో విభేదించి, 2019లో వైసీపీలో చేరారు. మైదు కూరులో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతు పలికారు. వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో జగన్ పాలనపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతూ మరోసారి తెరపైకి వచ్చారు.
టీడీపీ అనుకూల మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ… జగన్ పాలనను తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. తాజాగా మరోసారి ఆయన అదే పంథాను కొనసాగించడం గమనార్హం. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిందని డీఎల్ రవీంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అప్పులతో రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదన్నారు. కచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ కొరడా వేస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి దివాలా అంచున ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్న ఆర్థిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దని చెబుతున్నారని అన్నారు.
తాను ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నానే తప్ప విమర్శలు చేయడం లేదని డీఎల్ చెప్పడం విశేషం. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. తాను వైసీపీలో కొనసాగుతానని, టికెట్ ఇస్తారని తాను అనుకోవడం లేదని డీఎల్ సంచలన ప్రకటన చేశారు.
డీఎల్‌ను వైసీపీ నేతగా ఎల్లో మీడియా గుర్తిస్తూ, ఆయన విమర్శలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడాన్ని గమనించొచ్చు. వైసీపీ సీనియర్ నేత అనే గుర్తింపు వుండడం వల్లే ఆయన మాటలకు అంత ప్రాధాన్యం లభిస్తోంది. ఒకవైపు వైసీపీలో ఉన్నానని ఆయనే ప్రకటించుకుంటూ, మరోవైపు ఘాటు విమర్శలు చేస్తుంటే… అధికార పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వైసీపీలో క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉందో డీఎల్ విమర్శలే నిదర్శనం. మరి ఈ పార్టీ భవిష్యత్‌లో బతికి ఎలా బట్ట కడుతుందో పార్టీ పెద్దలకే తెలియాలి.