పట్టాభి ఎపిసోడ్ టైమ్ లో ఓసారి ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. రాష్ట్రపతిని కలిశారు. ఏపీలో అరాచకం జరిగిపోతోందంటూ ఫిర్యాదు చేశారు.
అదే టైమ్ లో మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం తెగ కష్టపడ్డారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో అనుకూల మీడియా సహాయంతో అమిత్ షా ఫోన్ చేశారంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. ఇప్పుడు బాబు మరోసారి ఢిల్లీ టూర్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పుడే ఎందుకు..?
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దేవెగౌడ లాంటి వారికి పిలిచి మరీ అపాయింట్ మెంట్ ఇచ్చి మర్యాదగా పలకరిస్తున్నారు మోదీ. రైతు చట్టాల రద్దుతో ఆయనపై భారం పూర్తిగా దిగిపోయి కాస్త రిలాక్స్ గా ఉన్నారు.
ఇదే ఊపులో వెళ్లి మోదీ, అమితా షాను కలవాలనేది బాబు కోరిక. రాష్ట్రం ఆర్థిక దివాలా, జగన్ కక్షపూరిత పాలన, టీడీపీ ఆఫీసులపై దాడులు, భువనేశ్వరి ఇష్యూ లాంటివి లేవనెత్తాలని బాబు ప్రయత్నిస్తున్నారు.
అసలు మేటర్ వేరే..
రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కేంద్రానికి ఫిర్యాదు అనేది బయటకు కనిపించే ముసుగు. కానీ ముసుగు లోపల చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2019 ఓటమి తర్వాత అర్జంట్ గా వెళ్లి మోదీ కాళ్లు పట్టుకోవాలని అనుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది బాబుకి సాధ్యం కావడంలేదు. ముందస్తుగా తన తరపున రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో చేర్పించేసి కొంత ప్యాచప్ చేసుకోవాలనుకున్నారు.
ఆ తర్వాత కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మోదీని పొగిడేవారు, కేంద్రం చేసిన తప్పులకి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించేవారు. ఇలా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు స్నేహ హస్తం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పట్టాభి ఎపిసోడ్ తో అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు భువనేశ్వరి ఎపిసోడ్ ని వాడుకోవాలనుకుంటున్నారు. సానుభూతి పొందడంతో పాటు, పొత్తు ప్రతిపాదన కూడా వారిముందు ఉంచాలనేది బాబు దూరాలోచన.
ఈసారైనా మోదీ కనికరిస్తారా..?
ఈసారి బాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారా.. అమిత్ షా కలుస్తారా.. అనేదే అసలు ప్రశ్న. చంద్రబాబు లాంటి వారిని అస్సలు దగ్గరకు రానీయకూడదని మోదీ గట్టిగా నమ్ముతున్నారు. బాబు వల్ల లాభం లేకపోవడం అటుంచి.. బాబుతో కలిస్తే ఏపీలో బీజేపీకి తీరని నష్టం కలుగుతుందనేది మరో వాదన.
ప్రస్తుతం జనసేనతో కలసిపోయి కాస్తో కూస్తో బలం పెంచుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ దశలో మళ్లీ టీడీపీతో కలిస్తే అది పార్టీ ఎదుగుదలకు అడ్డంకి. పోనీ పొత్తు లేకపోయినా కనీసం చంద్రబాబుకి అపాయింట్ మెంట్ ఇచ్చినా అది కూడా ఇబ్బందే. అపాయింట్ మెంట్ ఇస్తే.. కచ్చితంగా చంద్రబాబు ఎల్లో మీడియా ఎలాంటి ప్రచారం చేస్తుందో అందరికీ తెలుసు. అందుకే గేటు దగ్గరే చంద్రబాబుని ఆపేయాలనేది మోదీ ఆలోచన.
అపాయింట్ మెంట్ లేకుండానే ఢిల్లీకి..
గతంలో అపాయింట్ మెంట్ లేకుండా ఎగురుకుంటూ ఢిల్లీ వెళ్లి ఫూల్ అయ్యారు చంద్రబాబు. ఈసారి అలా కాకూడదని అనుకుంటున్నారు. అందుకే ఇక్కడినుంచే అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ నేతలతో కూడా లాబీయింగ్ చేయిస్తున్నారు. కుదరకపోతే ఇక్కడినుంచే ఆ ప్రయత్నం విరమించుకునేట్టు ఉన్నారు బాబు.
ఒక్క ఛాన్స్ ప్లీజ్
తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబుకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, ఎలాగోలా అంతా సెట్ చేసేస్తారు. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు, తనను వ్యక్తిగతంగా దూషించిన బాబు ముఖం చూడ్డానికి మోదీ ఇష్టపడడం లేదు.. తనపై రాళ్లు వేయించిన బాబుతో మాట్లాడ్డానికి అమిత్ షా ఇష్టపడం లేదు. కానీ బాబు మాత్రం ఈసారి ఎలాగైనా వీళ్లతో పొత్తు పెట్టుకోవాలని తెగ తపిస్తున్నారు.
బాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తే, ఈసారి అనుకూల మీడియాలో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందో.