కరోనా మహమ్మారి పోయిందనుకుంటే, మరింత ప్రమాదకరంగా దూసుకొస్తోందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకూ భారత్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ, ఆ మహమ్మారి వ్యాప్తి సర్వత్రా అలజడి సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డాక్టర్ శ్రీనివాసరావు అప్రమత్తం చేయడాన్ని పరిశీలిస్తే… ఒమిక్రాన్ ఎంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను డేంజరస్‌గా ప్రకటించడం మరింత భయాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ శ్రీనివాసరావు తాజా హెచ్చరికలు మరోసారి కరోనా మొదటి, రెండో వేవ్‌లను గుర్తు తెస్తూ, వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు ఎప్పుడైనా రావచ్చని డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఒమిక్రాన్ నివారణకు మన వంతు ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మీదట ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. కొత్త వేరియంట్‌ను కట్టడి చేయడం మన చేతుల్లోనే ఉందన్నారు.
ఇప్పటి వరకూ కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు, అలాగే రెండో డోస్ తీసుకోవాల్సిన వెంటనే వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని ఆయన సూచించారు. కొత్త వేరియంట్ ప్రవర్తన మనం పాటించే కోవిడ్ నిబంధనలపై ఆధారపడి వుంటుందని ఆయన చెప్పడంలో లోతైన అర్థం దాగి వుంది.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొత్త వేరియంట్ పంజా విసురుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలా వుండగా డాక్టర్ శ్రీనివాసరావు సూచనలు, హెచ్చరికలు కేవలం తెలంగాణ సమాజానికే అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి వుండదు. డాక్టర్ శ్రీనివాసరావు ప్రతి హెచ్చరిక మొత్తం సమాజానికి వర్తిస్తుంది.