కోర్టు పిటిషన్ తో ఈనాడు పరువు ఢమాల్!

తన నెత్తి మీద తానే చెత్త వేసుకోవడం అంటే ఇదే. తన పరువు తానే తీసుకోవడానికి ఈనాడు దినపత్రిక తెగబడింది. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా సేవలందిస్తున్న వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి సమకాలీన వ్యవహారాల…

తన నెత్తి మీద తానే చెత్త వేసుకోవడం అంటే ఇదే. తన పరువు తానే తీసుకోవడానికి ఈనాడు దినపత్రిక తెగబడింది. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా సేవలందిస్తున్న వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి సమకాలీన వ్యవహారాల అవగాహన ఉండాలని సదుద్దేశంతో వారు దినపత్రిక కొనుగోలు చేసుకోవడానికి అలవెన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అయితే వాలంటీర్లు అందరూ సాక్షి దినపత్రిక మాత్రమే కొంటున్నారని ఆ జీవోను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఈనాడు దినపత్రిక హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం పత్రిక కొనుగోలుకు డబ్బు ఇవ్వడానికి అలవెన్సు ఏర్పాటు చేసింది తప్ప ఫలానా పత్రికనే కొనుగోలు చేయాలంటూ రాతపూర్వకంగా గాని, మౌఖికంగా గానీ ఎక్కడా ఆదేశాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏ పత్రికను కొంటారు అనేది పూర్తిగా వాలంటీర్ల స్వేచ్ఛకు ఇష్టానికి సంబంధించిన విషయం.

తాము ప్రభుత్వంలో భాగంగా సేవలు అందిస్తున్నప్పుడు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమగ్ర కథనాలు, నిజాయితీగల వార్తా కథనాలు ఎందులో ప్రచురితమవుతున్నాయనిపిస్తే వారు ఆ పత్రికనే కొంటారు. పత్రికల విశ్వసనీయత అనేది ఒక మిథ్యా పదం అయిపోతున్న ఈ రోజుల్లో.. వారికి నచ్చిన పత్రికను కొనుగోలు చేసుకోవడం వాలంటీర్ల హక్కు.

అయితే ఇలాంటి జీవోనే రద్దు చేయాలనికోరుతూ ఈనాడు కోర్టుకెక్కడం.. వారి బలహీనతను, భయాన్ని వారే బయటపెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.  ఈనాడుకు ఎందుకంత భయం.. నిజానికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిపి సుమారు నాలుగు లక్షల వరకు ఉంటారు. కానీ వారు పిటిషన్ లో పేర్కొన్న ప్రకారమే పెరిగిన సాక్షి సర్కులేషన్ లక్షన్నర మాత్రమే. అయితే దానిని కూడా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ పరిగణించకూడదు అనేది వారి గొడవ. ఎందుకంటే.. ఏబీసీ అత్యధిక సర్కులేషన్ ను గుర్తిస్తే గనుక.. వారి యాడ్ టారిఫ్ పెరుగుతుంది. సహజంగా ప్రకటనలన్నీ అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రికకే వెళుతుంటాయి. 

ఒకప్పట్లో తమదే అత్యధిక సర్కులేషన్ కలిగిఉన్న దినపత్రిక అని చెప్పుకుంటూ ఉన్న ఈనాడు ఇప్పుడు ఆ హోదాను కోల్పోతుంది. వారికి ప్రకటనల టారిఫ్ పరంగా దెబ్బ పడుతుంది. ప్రకటనలూ తగ్గుతాయి. ఈ నేపథ్యంలో అసలు వాలంటీర్లకు పత్రికలే అందకూడదన్నట్టుగా కుట్రపూరితంగా ఇలాంటి కేసు వేయడం అసహ్యంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ద్వారా నెగ్గే అవకాశం లేని, అసంబద్ధమైన పిటిషన్ వేసి, తన పరువు తానే పోగొట్టుకుంటున్నదని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.