ఎన్టీఆర్ ఆర్ట్స్ ను తన సొంత బ్యానర్ గా చెప్పడం లేదు కల్యాణ్ రామ్. ఆ బ్యానర్ తన కుటుంబం మొత్తానిది అంటున్నాడు. మరీ ముఖ్యంగా తన తమ్ముడు తారక్ బ్యానర్ అని చెబుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తారక్ నటిస్తే తను అస్సలు సెట్స్ కు రానంటున్నాడు.
“ఎన్టీఆర్ ఆర్ట్స్ కు నేను నిర్మాతను కాదు. ఇంకా చెప్పాలంటే అది తారక్ బ్యానరే. నేనేదో నిర్మాతగా వచ్చి ఛెయిర్ లో కూర్చొని ఎంక్వయిరీ చేయడం లాంటివి చేయను. జై లవకుశ సినిమా మొత్తం షూటింగ్ లో 2-3 రోజులు మాత్రమే వెళ్లాను. ఎందుకు రావడం లేదని ఎన్టీఆర్ అడిగాడు. అది నీ బ్యానర్, నీకు ఎలా కావాలంటే అలా చేసుకో, నేనెందుకు మధ్యలో అని చెప్పాను. ఓ సోదరుడిగా నేను ఎప్పుడూ ఎన్టీఆర్ తో ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా తారక్ విషయంలో నేను ఓ బ్రదర్ గా తప్ప, మరే పాత్ర పోషించను. నిర్మాతగా నా పేరు పడుతుందేమో తప్ప, తారక్ సినిమాలకు నేనెప్పుడూ ప్రొడ్యూసర్ అనుకోను. అది ఆయన బ్యానర్.”
ఇలా తారక్ పై తన ప్రేమను చూపించాడు కల్యాణ్ రామ్. తమ్ముడి సినీ అనుభవంతో పోల్చి చూస్తే తనది చాలా తక్కువని, అలాంటప్పుడు తమ్ముడి సినిమా కోసం కండిషన్స్ పెట్టే అవసరమే ఉండదని అన్నాడు.
“ఎన్టీఆర్ నా సోదరుడు. మేమంతా ఓ ఫ్యామిలీ. అలాంటప్పుడు నేనెందుకు నిర్మాతగా కండిషన్లు పెట్టాలి. నేను కేవలం 19 సినిమాలే చేశాను, ఎన్టీఆర్ 30 సినిమాలు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సినిమాకు సంబంధించి నేనెవ్వర్ని డిసైడ్ చేయడానికి. మా తాతగారి పేరు మీద పెట్టిన బ్యానర్ కు నేను ఎంత బాధ్యతగా ఫీల్ అవుతానో, నా బ్రదర్ అంతకంటే ఎక్కువగా బాధ్యతగా ఫీల్ అవుతారు.”
కొరటాల దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమాకు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సహ-నిర్మాతగా వ్యవహరించనుంది. ఆ సినిమా విషయంలో కూడా తన ప్రమేయం ఏమీ ఉండదని, స్క్రీన్ పై టైటిల్ వరకే తన పేరు ఉంటుందని కల్యాణ్ రామ్ ప్రకటించాడు.