“కాదేదీ కవితకనర్హం” అని మహా కవి శ్రీశ్రీ అన్నట్లుగా ఎన్నికల ఏడాదిలో రాజకీయ నాయకులు ప్రతీ విషయాన్ని ఎన్నికలకు ప్రచార అస్త్రంగానే వాడుకుంటారు. ఈ విషయంలో వారి బుర్రలు చాలా చురుగ్గా పనిచేస్తాయి. తెలంగాణలో ఇది ఎన్నికల ఏడాది అనే విషయం తెలిసిందే కదా. దీంతో అన్ని పార్టీలు చేస్తున్న హడావుడి చూస్తూనే ఉన్నాం. అధికార పార్టీ మీద విపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ప్రతిపక్షాలు వివిధ పేర్లతో పాదయాత్రలు చేస్తున్నాయి. ఏమాత్రం ప్రజాదరణ లేని పార్టీలు కూడా తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో అయితే ఎన్నికల సెగ బాగా కొడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేసింది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని ఏదో బ్రహ్మోత్సవాల టైపులోనో, ఇండిపెండెన్స్ డే టైపులోనో చేయబోతోంది. దాన్నొక రాష్ట్ర ఉత్సవంగా ఫోకస్ చేస్తోంది.
తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభ వేడుకలు అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టినందున (ఇలా పేరు పెట్టడం కూడా ఓట్ల కోసమే) ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టేలా సచివాలయాన్ని నిర్మించి.. అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. సచివాలయ ప్రారంభం అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూస్తున్నారు. జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తారు.
ఇక కేసీఆర్ సెంటిమెంట్ గురించి తెలిసిందే కదా. దాని ప్రకారం …సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహిస్తారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభకు తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరవుతారు. దీంతో భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రెడీ చేశారు. ఈ మొత్తం హడావుడి చూస్తుంటే ఏమనిపిస్తుంది ? ఎన్నికల ప్రచార సభ మాదిరిగానే ఉంది కదా.