నా ఫ్యాన్స్ అంతా నాకు ఓటేయరు – పవన్

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ సభ పెడితే, చాలామంది జనం వస్తారు. తెలియనివారు ఎవరైనా అది చూస్తే, ఇతడేదో ఓ పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటారు. కానీ అలా పవన్…

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ సభ పెడితే, చాలామంది జనం వస్తారు. తెలియనివారు ఎవరైనా అది చూస్తే, ఇతడేదో ఓ పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటారు. కానీ అలా పవన్ సభలకు వచ్చిన జనాల్లో సగం మంది కూడా ఆయనకు ఓట్లేయరు. అందుకే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు పవన్ కల్యాణ్. తన పార్టీని కూడా గెలిపించుకోలేకపోయారు.

ఇదంతా గతం. ఇప్పుడీ చర్చ ఎందుకంటే, ఇదే ప్రశ్నను బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ను అడిగారు. ఇంతమంది అశేష అభిమానులున్నప్పటికీ ఎందుకు ఓట్లు పడలేదని ప్రశ్నించారు. దానికి పవన్ కూడా అంతే సూటిగా సమాధానం ఇచ్చారు. “నా ఫ్యాన్స్ అంతా నాకు ఓటేయరు” అనేది పవన్ మాట.

“అభిమానం వేరు, అది ఓట్లు కింద మారడం వేరు. దాని కోసం దశాబ్దాలు కష్టపడాలి. సినీ రంగంలో పేరు తెచ్చుకోవడానికి నాకు దశాబ్దానికి పైగా పట్టింది. రాజకీయరంగంలో కూడా ఆ నమ్మకం తెచ్చుకోవడానికి అంతే కృషి చేయాలి. అప్పుడే అభిమానం ఓట్ల కింద మారుతుంది. దీనికి టైమ్ పడుతుంది. అలా ప్రజలకు మనపై నమ్మకం పెరగాలంటే గట్టిగా నిలబడాలి. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. తక్కువలో తక్కువ దశాబ్దంన్నర పడుతుంది. ప్రస్తుతానికి నేనైతే నమ్మకం సంపాదించుకునే స్థితిలో ఉన్నాను.”

ఇలా తన ప్రస్తుత రాజకీయ స్థితిపై స్పందించారు పవన్ కల్యాణ్. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవంటూనే, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పవన్ గొప్పలు చెప్పడం విడ్డూరం.

ఈ సంగతి పక్కనపెడితే.. అంతా ఊహించినట్టుగానే ఈసారి బాలకృష్ణ అన్-స్టాపబుల్ కార్యక్రమం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. పవన్ ను కూర్చోబెట్టి చేసిన ఇంటర్వ్యూలో పార్ట్-1లో కాస్త సినిమాలు, వ్యక్తిగత విషయాలు టచ్ చేసినప్పటికీ, రెండో ఎపిసోడ్ లో మాత్రం రాజకీయాల నుంచే చర్చ మొదలుపెట్టారు.

దాదాపు 40 నిమిషాల సమయం రాజకీయాలు, జనసేన కార్యాచరణ, పవన్ కు రాజకీయంగా కలిసొచ్చే ఎలివేషన్లు ఇచ్చేందుకే బాలకృష్ణ గట్టిగా కృషిచేశారు. అలా పవన్ కు పొలిటికల్ మైలేజీ తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేశారు ఈ టీడీపీ ఎమ్మెల్యే.