400 రోజులు, 4 వేల కిలోమీటర్ల లక్ష్యంతో మొదలైన లోకేశ్ పాదయాత్ర… రోజులు గడిచే కొద్ది బలహీనపడుతోంది. ఒక వైపు ఆశించిన స్థాయిలో జనాలు రాకపోవడంతో లోకేశ్‌తో పాటు టీడీపీ కార్యకర్తలు, నేతల్లో నిరుత్సాహం నెలకుంది. దీంతో లోకేశ్ పాదయాత్ర గురించి మీడియాలో కనీస చర్చ కూడా జరగడం లేదు.
ఎల్లో మీడియా అయితే లోకేశ్ పాదయాత్ర గురించి పట్టించుకోకపోవడమే ఉత్తమం అని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన పాదయాత్రను అడ్డుకుంటోందనే ఆరోపణలతో లోకేశ్ తన వైపు మీడియాని, జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
కోటి విద్యలు యువగళం విజయవంతానికే అనే రీతిలో లోకేశ్ ఏవేవో వ్యూహాలు రచిస్తున్నారు. చివరికి సీఎం జగన్‌కు లోకేశ్ ఓ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ‘జగన్.. నువ్వు సహకరిస్తే పాదయాత్ర. లేకుంటే దండయాత్రే’ అని లోకేశ్ హెచ్చరించడం వెనుక ఆయన వ్యూహాన్ని తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు.
లోకేశ్ పాదయాత్ర ఇప్పటికి రెండు వారాలు పూర్తి చేసుకుంది. తన దారిన తాను నడుస్తూ పోతుంటే ఎవరు అడ్డుకుంటున్నారు? తానేదో మైకులో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు లాక్కున్నారని ఆయన ఆరోపణ. ఒకవేళ అదే జరిగి వుంటే… పోలీసులు మంచి చేసినట్టే కదా? అసలే ఆణిముత్యాల్లాంటి మాటలతో జనం జడుసుకుంటున్న పరిస్థితి. మైకు తీసుకుంటే ఏం మాట్లాడ్తాడో అని టీడీపీ కార్యకర్తలు భయంతో వణికిపోతున్నారు.
జనంతో మాట్లాడితే ఏదైనా ప్రయోజనం వుంటుంది. అది వదిలేసి మైకు తీసుకుని మాట్లాడ్తా అనడమేంటో ఆయనకే తెలియాలి. ప్రజలతో ముచ్చటిస్తే వారి సమస్యలేంటో తెలుస్తాయి. అధికారంలోకి వస్తే ఫలానా మంచి పని చేస్తామనే భరోసా ఇవ్వొచ్చు. అది వదిలేసి కేవలం సీఎం జగన్‌ను విమర్శించడానికి మాత్రమే పాదయాత్ర చేస్తున్నారనే అభిప్రాయాన్ని లోకేశ్ కలిగిస్తున్నారు. ఇది ఆయనకు నష్టమే.
టీడీపీ నేతలు పదేపదే పాదయాత్రకు జగన్ సహకరించడం లేదనే విమర్శలు చేస్తున్నారు. జగన్ సహకరించడం అంటే… ‘లోకేశ్ బాబు నువ్వు నడవడానికి వంకరటింకర్లు పోతున్నావు. కాస్త రెస్ట్ తీసుకో బుజ్జి కన్నా. నడవడం నాకు అలవాటే. నేను నడుస్తా. నీ లక్ష్యాన్ని నేను పూర్తి చేస్తా’ అని సీఎం అనాలా? అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఆడలేక మద్దెల దరువు చందాన తమపై లోకేశ్ ఏడుస్తున్నాడని ప్రత్యర్థులు మండిపడుతున్నారు.
పాదయాత్ర చేయలేనని చేతులెత్తేస్తే, జనంతో ఎలా మమేకం కావాలో తమ నాయకుడు వైఎస్ జగన్ మరోసారి చేసి చూపుతారని వైసీపీ కార్యకర్తలు హితవు చెబుతున్నారు.