మహాభారతంలోని శ్రీకృష్ణరాయబారం ఘట్టంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. పాండవులకు సగం రాజ్యం ఇవ్వాలని, కనీసం ఐదుగురు అన్నదమ్ములకు ఐదు ఊళ్లయినా ఇవ్వాలని అడిగిన తర్వాత కృష్ణుడు ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తాడు. అలా ఇవ్వకపోతే ‘‘అలుగుటయే ఎరుంగని అజాతశత్రుడే అలిగిన నాడు.. సముద్రములన్నియు ఏకముగాకపోవు’’ అంటూ, ధర్మరాజుకు కోపం వస్తే మీరందరూ సర్వనాశనం అయిపోతారంటూ కృష్ణుడు సుయోధనుడిని బెదిరించే ప్రయత్నం చేస్తాడు. దానికి ఆయన సమాధానం ఇలా ఉంటుంది.
‘‘కృష్ణుడా నువ్వు దూతగా వచ్చావు వాళ్లు ఏం చెప్పారో మాకు చెప్పాలి, మేము ఏం చెప్పామో తిరిగి వాళ్లకు తెలియజేయాలి. అంతేతప్ప వాళ్ళ హీరోయిజం వర్ణిస్తూ మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను రాజ్యం ఇవ్వడానికి ఒప్పుకుంటే.. అన్నగా దయతో తమ్ముళ్లకు ఇచ్చినట్టు అవుతుందా? లేదా, నువ్వు చెప్పిన బెదిరింపులకు భయపడి ఇచ్చినట్టు అవుతుందా?’’ అనే సందేహం లేవనెత్తుతాడు.
ఇప్పుడు నారా లోకేష్ సృష్టించిన వాతావరణం కూడా అలాగే ఉంది. నిబంధనల ప్రకారం నడుచుకోమని, పాదయాత్ర, ప్రసంగాలు ఉండాలని నిర్దేశిస్తున్నందుకు పోలీసులను ప్రతిరోజూ ఆడిపోసుకుంటున్న నారా లోకేష్, ‘‘సహకరిస్తే పాదయాత్ర- లేకపోతే దండయాత్ర చేస్తానని’’ అనడం ఓవర్ యాక్షన్ అనిపించుకుంటోంది.
పోలీసులు ఎటూ ఆయన యాత్రకు సహకరిస్తూనే ఉన్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులను కేటాయించి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. భద్రత కోసం పెద్ద సంఖ్యలో పోలీసులను ఇస్తే ‘నా మీద నిఘా పెడుతున్నారు’ అని అంటారు. ఇవ్వకపోతే ‘ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే కనీసం పోలీసులను పంపరా’ అని ఏడుస్తారు. పోలీసులు ఎలా వ్యవహరించినా వారి చర్యలలో రంధ్రాన్వేషణ చేయడం మాత్రమే నారా లోకేష్ అలవాటుగా చేసుకున్నారు. అయినా సరే, నారా లోకేష్ దుందుడుకు మాటలను పట్టించుకోకుండా పోలీసులు తమ బాధ్యత తాము నిర్వర్తిస్తూ పోతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ‘మీరు సహకరిస్తే పాదయాత్ర సహకరించకపోతే దండయాత్ర చేస్తానని’ లోకేష్ బెదిరించడం అనుచితంగా ఉంది. ఇప్పుడు పోలీసులు యధా పూర్వం సహకారం అందించినా కూడా ఆయన బెదిరింపులకు భయపడి వ్యవహరిస్తున్నట్లు అవుతుందా? లేదా, తమ బాధ్యత కోసం పనిచేస్తున్నట్లు అవుతుందా? అనేది మీమాంస.
ఎలాగైనా సరే పోలీసులను, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి తన పాదయాత్ర ఆగిపోయేలా చేసి.. కష్టం తప్పించుకుని ప్రభుత్వం మీద మరింత ఘాటుగా నిందలు వేయాలని నారా లోకేష్ కుట్ర రచన చేస్తున్నట్లుగా ఈ ఎపిసోడ్ మనకు అర్థమవుతోంది.