చంద్రబాబు శకునాలకు ప్రపంచం స్తంభిస్తుందా?

‘శుభం పలకవా స్వామీ’ అంటే ‘ఆ పెళ్లికూతురు ముండను ఇలా తీసుకురండి’ అన్నాట్ట వెనకటికి ఓ పంతులుగారు! ఈ సామెత తెలుగునాట బాగా పాపులర్. ప్రస్తుతం చంద్రబాబునాయుడు పరిస్థితి, తీరుతెన్నులు కూడా అదే రకంగా…

‘శుభం పలకవా స్వామీ’ అంటే ‘ఆ పెళ్లికూతురు ముండను ఇలా తీసుకురండి’ అన్నాట్ట వెనకటికి ఓ పంతులుగారు! ఈ సామెత తెలుగునాట బాగా పాపులర్. ప్రస్తుతం చంద్రబాబునాయుడు పరిస్థితి, తీరుతెన్నులు కూడా అదే రకంగా ఉన్నాయి.

అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రానికి పెట్టుబడులను, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతుండగా.. చంద్రబాబునాయుడు తనకు సాధ్యమైనంత వరకు అడ్డుకోవడానికి ముందుకు సాగుతున్నారు.

విశాఖకు వీలైనంత త్వరలోనే రాజధానిని తరలించి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో ఒక స్థిరత్వం తీసుకువచ్చేందుకు జగన్ సంకల్పిస్తుండగా.. అసలు రాజధానిని విశాఖకు తరలించడం అసాధ్యం అంటూ చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్లు పెట్టి శకునాలు పలుకుతున్నారు.

విశాఖను ఎడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేసి అక్కడినుంచి పాలన సాగించాలని జగన్ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. అయితే, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి పేరుతో ఒక రియల్ ఎస్టేట్ దందాను నడిపించడానికి ప్లాన్ చేసిన చంద్రబాబునాయుడు బృందానికి మాత్రం ఇది కంటగింపుగా మారింది. దానికి ఎన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్నారో అందరూ గమనిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తన నివాసం కూడా విశాఖకు మారబోతున్నదనే సంగతిని ప్రకటించిన తర్వాత.. ఈ విషయంలో కాస్త కదలిక వచ్చింది. చంద్రబాబునాయుడు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పుడు రాజధానిని తరలించడం అసాధ్యం అంటూ శకునాలు పలుకుతున్నారు. 

కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ నివేదిక తర్వాతనే రాజధానిగా అమరావతి ఎంపిక జరిగిందని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయడం అనేది చంద్రబాబునాయుడుకు కొత్తగా నోరెత్తడానికి అవకాశం కల్పించినట్టుంది. కానీ ఈ విషయాన్ని వారు గతంలో కూడా చెబుతూనే ఉన్నారు. ఆ విషయం ఎవ్వరికీ తెలియనిదేం కాదు. కానీ, రాజధాని ఎంపిక అనేది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని వ్యవహారం అని కూడా కేంద్రంలోని మంత్రులే గతంలో అనేక సందర్భాల్లో పార్లమెంటులోనే వెల్లడించారు. 

కేంద్రం అఫిడవిట్ ను ఎవ్వరూ కాదనడం లేదు. చంద్రబాబునాయుడు, తన స్వార్థ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసం, అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ.. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా, పాత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని నిర్ణయించారు. ఈ ప్రభుత్వానికి ఉండే అధికారాన్ని కూడా ఎవ్వరూ కాదనలేరు.

కానీ చంద్రబాబునాయుడు మాత్రం.. అర్థసత్యాలు మాట్లాడుతూ, ప్రజల్లో ఒక భయావహ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా రాజధాని విషయంలో తతిమ్మా ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.