“బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తు…ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు” అని సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట రాసారు.
ఆ సాహిత్యాన్ని ఒక వర్గం ఒప్పుకున్నా ఉపాధ్యాయవర్గం తూలనాడింది. చదువులు వేస్టని మీలాంటి సరస్వతీపుత్రులే అంటే ఎలాగండీ అని శాస్త్రిగారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం- “నేను చదువులు వేస్టనలేదు. బోడి చదువులు వేస్ట్ అన్నాను” అన్నారు.
ఇక్కడే మతలబుంది. మనలో చాలా మందికి చదివే చదువుకి, చేస్తున్న పనికి సంబంధం ఉండదు. చదివింది మెకానికల్ ఇంజనీరింగైతే తర్వాత ఏదో చిన్న కోర్స్ చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడినవాళ్లే ఎక్కువ. బీఏ చదివిన రాఘవేంద్రరావు, అగ్రికల్చర్లో డిగ్రీ పొందిన కృష్ణవంశి, ఇంజనీరింగ్ చదివిన ఆర్జీవీ..ఇలా లెక్కేసుకుంటూ పోతే చదవడానికేదో “బోడి చదువు” చదివి బతకడానికి తమకు చేతనైన, నచ్చిన పనిని ఎంచుకున్నారు. అలా ఇష్టం లేకపొయినా మొక్కుబడికి చదివే చదువులే శాస్త్రిగారి దృష్టిలో “బోడి చదువులు”.
సినిమా రంగానికి చదువుసంధ్యల్లేనివాళ్లే ఎక్కువగా వస్తారనుకునేరోజుల్లో రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు లాంటి వాళ్లు టైటిల్స్ లో పేరు చివర “బీఏ” అని తగిలించుకునేవారు. చదువుకున్నవాడంటే గౌరవమెక్కువగా ఉంటుందనుకునే రోజులవి. కానీ ఆయన తరవాత కాలంలో కూడా “బోడి” చదువుల మీద సమయాన్ని వెచ్చించకుండా ఆడుతూ పాడుతూ నచ్చింది చేసుకుంటూ ఈ రోజు టాప్ పొజిషన్లో ఉన్న ఎందరో మన కళ్లముందు సినిమా రంగంలో ఉన్నారు.
కుటుంబంలో ఒకరో ఇద్దరో అంటే అనుకోవచ్చు..కానీ ఏకంగా ఇంటిల్లిపాదీ అకడెమిక్స్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ధైర్యంగా నిలబడి తమ ప్రత్యేకత చాటుకున్నది మాత్రం కీరవాణి, రాజమౌళి, శ్రీలేఖ.
వీరిలో శ్రీలేఖ అసలు బడికే పోలేదట. ఆమెకీ స్కూలుకెళ్లాలనే కోరిక కలగకపోవడం, ఇంట్లో వాళ్లు కూడా ఆమెని బడికి పంపాలని అనుకోకపోవడం ఆశ్చర్యం. కానీ ఆమెకంటూ సినీసంగీతరంగంలో ఒక గుర్తింపు, సంపాదన, అవార్డులు దక్కాయి. ఇక కీరవాణి, ఆయన తమ్ముడు కళ్యాణి మాలిక్ హైస్కూల్ దాటి చదవలేదు. అది కూడా మిడిల్ డ్రాపేనట. అయితేనేం…వాళ్ల పాటలు వింటూ, వాళ్ల సక్సెస్ ని చూస్తూ అనామకంగా ఎక్కడో ఏదో ఉద్యోగం చేసి బతుకుతున్న కోట్లాది మంది పీహెచ్డీలు ఉన్నారు.
ఇక రాజమౌళి… దేశంలోని బాక్సాఫీసుని కొల్లగొట్టి, అంతర్జాతీయంగా ఆస్కార్ తలుపులు తట్టి జేంస్ కేమరూన్ తో ముచ్చట్లు పెట్టిన ఘనుడు. ఆయన అతికష్టమ్మీద ఇంటర్ సగం వరకు చదివినట్టు టాక్.
కానీ రాజమౌళిగానీ, కీరవాణి గానీ అద్భుతమైన ఇంగ్లీషులో మాట్లాడగలరు. ఇంగ్లీషంటే మరొక పేరు చెప్పుకోవాలిక్కడ. జూ ఎన్.టి.ఆర్… ఇతను కూడా వానాకాలం చదువులు చదివినవాడే. కాలేజి ఏజ్ మొదలయ్యీ మొదలవ్వనప్పుడే హీరో అయిపోయాడు. ఇక పుస్తకం పట్టుకోవాల్సిన పని పట్టలేదు. మొన్నీమధ్య అమెరికాలో మీడియా వాళ్ల ముందు అదరగొట్టే విధంగా ఇంగ్లీష్ మాట్లాడాడు. అతని వాక్ప్రవాహం చూసి మనలో ఇంగ్లీష్ పండితులే నోరెళ్లబెట్టారు. అలా మాట్లాడడానికి, తన చదువుకి సంబంధం లేదు.
ఇక్కడ చెప్పుకునేది ఒక్కటే. ఫలానాది నేర్చుకోవాలన్న తపన ఉండి, దానికి తగ్గ మెదడు ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించగలరు. అంతే కానీ ఊకదంపుడుగా నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా చదువులచట్రంలో దాదాపు 20 ఏళ్ల పాటు నలిగిపోవడం అనవసరం. ఎందుకంటే అలా నలగ్గొంటినంత మాత్రాన వారికేదీ వచ్చేయదు. వాళ్లకి ఎందులో ఆసక్తి ఉంటుందో అదే పట్టుకుంటారు. ఇదంతా ఆలోచిస్తే లక్షలు, కోట్లు పెట్టి పిల్లల్ని చదివించుకోవాలనే తల్లిదండ్రుల తపన ఎందుకో అర్ధంలేదనిపిస్తుంది.
ఇక్కడ పైన చెప్పుకున్నట్టు చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు.
డీవీవీ దానయ్య… ఈయన కూడా చదువుకోలేదు. అయితేనేం..వ్యాపారసూత్రాలు, సినీ నిర్మాణంలో లెక్కలు అన్నీ ఔపోసని పట్టిన బడా నిర్మాత.
అలాగే దిల్ రాజు. ఈయన కూడా “బోడి” చదువులు చదవలేదు. కానీ వ్యాపారం ఎలా చెయ్యాలి, కన్స్యూమర్ పల్స్ ఎలా పట్టుకోవాలి, ప్రొడక్షనంటే ఏవిటి, పంపిణీ ఎలాగ అనే విషయాల్లో హార్వార్డ్ ఎంబియే గ్రాడ్యుయెట్స్ కూడా గెస్ట్ లెక్చర్లివ్వగలడు, పక్కన ట్రాన్స్లేటరుంటే. “వారసుడు” తమిళ్ సభలో దిల్ రాజు మాట్లాడిన ఇంగ్లీష్ చూసి చాలామంది నవ్వుకుని ఉండొచ్చు. కానీ తన కన్నా ఎన్నో చద్వులు చదివి కూడా తన సంపాదనలో ఒకటో వంతు కూడా సంపాదించలేని ఇంగ్లీష్ మేధావుల్ని చూసి దిల్ రాజు ఎంత నవ్వుకోవాలి!
కామన్ సెన్స్, ధైర్యం, మానవ సంబంధాలు, ఆసక్తి, క్రమశిక్షణ…ఇవన్నీ ఉన్నవాడికి ఏ పుస్తకాల చదువులూ అక్కర్లేదు. సొంత ప్రతిభ ఉంటే దానితో రాణిస్తాడు. లేకపోయినా ప్రతిభావంతులతో వ్యాపారం చేసి గడిస్తాడు.
చదువుకుంటే ఆత్మస్థైర్యం పెరుగుతుందంటారు. అది కూడా అర్ధసత్యమే. పైన చెప్పుకున్న ఎవరికీ ఆత్మస్థైర్యానికి కొదవ లేదు.
కనుక ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ యుగంలోనైనా కళ్లు తెరిచి అకడెమిక్ విద్యకి ఎంతవరు ప్రాధాన్యమివ్వాలో అంతవరకే ప్రాధాన్యం ఇచ్చే సమాజం వస్తుందేమో చూడాలి. ఈ పనిని పైన చెప్పుకున్నవాళ్లు దశాబ్దాల క్రితమే చేసారు కనుక వాళ్లు “వే ఎహెడ్ ఆఫ్ టైం” అనుకోవాలి మనం.
శాస్త్రిగారు టెండూల్కర్ పేరు చెప్పి ఆ పాట రాసినా, ఇక్కడ ఇంతమంది సినీసెలబ్రిటీస్ ని ఉదహరించి ఇదంతా రాసినా…విషయం బలంగా అర్ధకావడానికే. నిజానికి అసలేమీ చదువుకోని వాళ్లు, చదువుకున్నా సరిగ్గా చదవని వాళ్ళు తమ తెలివితో తెగువతో కోట్లకి పడగలెత్తి పలువురికి ఉపాధి కల్పిస్తున్నవారు మన చుట్టూ చాలామంది ఉంటారు. ఒక్కసారి పరికిస్తే కనిపిస్తారు.
కనుక చదువు రావట్లేదని, ప్రతి తరగతిలోనూ ఫెయిలౌతున్నానని విద్యార్ధులు దిగులు చెందక్కర్లేదు, వాళ్ల తల్లిదండ్రులు కూడా బెంగపడక్కర్లేదు. చదివినా చదవకపోయినా మనిషి బుద్ధిని, వ్యక్తిత్వాన్ని అనుసరించి ఒకలాగే బతుకుతాడు. ఐ.ఐ.టిలో చదివి ఏ ఉద్యోగమూ చేయనివాళ్లూ సక్సెస్ కానీ వాళ్లూ కూడా మన చుట్టూ ఉంటారు. కనుక సహజంగా లోపల విషయముండాలి కానీ భవిష్యత్తు చదువులను బట్టే ఉంటుందని కాదు!
హరగోపాల్ సూరపనేని