చెప్పాల్సిన విషయం ఎక్కువగా ఉన్నప్పుడు సినిమాను 2 భాగాలుగా తీయడం సహజం. బాహుబలి ఇలానే వచ్చింది. ఆ మధ్య పుష్ప సినిమా కూడా ఇలానే తెరకెక్కింది. పార్ట్-1 వచ్చింది, పార్ట్-2 షూటింగ్ లో ఉంది. మరి టైమ్ ఉంటే 2 భాగాలు, టైమ్ లేకపోతే సింగిల్ సినిమాగా తీయడం సాధ్యమౌతుందా..? సలార్ సినిమాతో దాన్ని సాధ్యం చేయబోతోంది యూనిట్.
సలార్ సినిమా సెట్స్ పైకి వచ్చిన ప్రారంభంలోనే ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోందనే ప్రచారం మొదలైంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ, స్వయంగా ప్రశాంత్ నీల్ దీనిపై లీకులిచ్చాడు. 'ఉండొచ్చేమో' అనే విధంగా స్పందించాడు.
దీంతో సలార్ పార్ట్-1 ఈ ఏడాదిలో వస్తుందని, ఆ తర్వాత పార్ట్-2 వస్తుందని ప్రభాస్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే, ఇప్పుడు సలార్ సినిమా సింగిల్ మూవీగానే రాబోతోందనేది తాజా సమాచారం.
అంతా వాళ్లిష్టమేనా.. కథ డిమాండ్ చేయదా..?
“కథ డిమాండ్ చేస్తోంది తప్పలేదు. కథ డిమాండ్ చేసింది కాబట్టి బడ్జెట్ పెరిగింది. ఈ కథ అలా డిమాండ్ చేస్తోంది.” లాంటి డైలాగ్స్ చాలానే విన్నాం. మరి సలార్ విషయంలో రెండు భాగాలు కావాలని కథ డిమాండ్ చేయలేదా..?
సలార్ సినిమాను 2 భాగాలుగా అనుకున్నప్పుడే చాలా ఊహాగానాలు చెలరేగాయి. బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని, ప్రభాస్ కే వంద కోట్లు ఇవ్వాల్సి వచ్చిందని, కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రెండు భాగాలు ఉండాల్సిందేనంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇప్పుడేమో ఒక భాగమే అంటున్నారు. ఎందుకంటే, ఈసారి టైమ్ లేదంట. సలార్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్టుపైకి వెళ్లాలి. ఇక ప్రభాస్ సంగతి తెలిసిందే. చేతిలో 3 సినిమాలు ఆడుతున్నాయి. దీంతో సలార్ ను సింగిల్ సినిమాగానే రిలీజ్ చేస్తామంటూ లీకులు మొదలయ్యాయి.
అంటే.. టైమ్ ఉంటే 2 భాగాలు తీస్తారు, టైమ్ లేకపోతే సింగిల్ సినిమా కిందే కొట్టేస్తారన్నమాట. ఇదెక్కడి విడ్డూరం. ఇక్కడ “కథ డిమాండ్ చేయడం” లాంటి పడికట్టు డైలాగ్స్ వినిపించవా? అంతవరకు వస్తే, ఈ సినిమా కథ పార్ట్-2 కోసం డిమాండ్ చేయడం లేదని చెప్పినా చెబుతారు. అదే గమ్మత్తు.