కొత్త జిల్లా ఏర్పడిన ముహూర్తం సందర్భం బాగున్నట్లుగా ఉంది. అందుకే ఏకంగా లక్షల కోట్లు పెట్టుబడిగా వస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించిన ప్రకారం చూస్తే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎనర్జీ పార్కుకు లక్షా పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి.
ఇది నిజంగా అనకాపల్లి సహా ఉత్తరాంధ్రాకే అతి పెద్ద వరం అని అంటున్నారు. ఎనర్జీ పార్క్ ద్వారా అరవై నుంచి డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ పార్కు ద్వారా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయని జిల్లా అధికారులు తెలియచేస్తున్నారు.
వర్తమాన ప్రపంచంలో ఇంధన రంగంలో అనేక వినూత్న మార్పులు వస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటూ ఎనర్జీ పార్క్ ని డిజైన్ చేశారు. ఎంటీపీసీ ఈ ప్రాజెక్ట్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతానికి కొత్త శోభను కల్పించింది అని చెప్పాలి.
విశాఖలో అరవై ఎకరాల్లో డేటా సెంటర్ తో పాటు టెక్ పార్క్ ని ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల విశాఖలో ఐటీ రంగం వెళ్ళూనుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. పాతిక వేల మంది దాకా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. అంటే ఉమ్మడి విశాఖలో తీసుకుంటే దాదాపు లక్ష ఉద్యోగాలు లక్షల పెట్టుబడులకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిందన్న మాట. ఇది కాదా మా ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని వైసీపీ నేతలు అంటున్నారు అంటే అర్ధం చేసుకోవాలి కదా.