రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమెల్సీ సీటు ఇపుడు ఒక్కసారిగా హీటెక్కింది. ఎన్నడూ లేని విధంగా అధికార ప్రధాన ప్రతిపక్షాలు పోటీకి దిగుతూండడంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నాయి.
ఉత్తరాంధ్రాలోని అయిదు జిల్లాల్లో మొత్తం ఓట్లు రెండున్నర లక్షల 83 వేల 759 ఓట్లు ఉంటే అందులో సగానికి పైగా విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. దాంతో అభ్యర్ధులు అంతా విశాఖ చుట్టూనే తిరుగుతున్నారు ఏజేన్సీ అయిన అల్లూరి జిల్లాలో 11 వేల మంది పట్టభద్రులు ఓటు నమోదు చేయించుకున్నారు విజయనగరంలో 58 వేల మంది ఓటర్లు ఉన్నారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని అభ్యర్ధిని గెలిపించి ముఖ్యమంత్రి జగన్ కి గిఫ్ట్ ఇద్దామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో గెలిచి ఉత్తరాంధ్రా కంచుకోట తమదే అని చెప్పాలనుకుంటోంది.
సిట్టింగ్ సీటు తమదే అని ఏపీలో ఎమ్మెల్సీ సీట్లు అన్నీ గెలుస్తామని ఆ పార్టీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ధీమాగా చెబుతున్నారు. శాసన మండలిని పునరుద్ధరించాక రెండు సార్లు సీపీఎం అభ్యర్థి గెలిచారు. దాంతో ఈసారి విజయం తమదేనని ఆ పార్టీ అంటోంది. పట్టభద్రుల ఓటర్లు ఎవరిని కరుణించి గిఫ్ట్ ఇస్తారో తెలియదు కానీ ఉత్తరాంధ్రా మీద మాత్రం చాలా ఆశలే పెట్టుకున్నాయి రాజకీయ పార్టీలు.
తాము గెలిస్తే ఉత్తరాంధ్రాలో రేపటి ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని, ఉత్తరాంధ్రా సెంటిమెంట్ తో ఏపీలో అధికారం తమనే వరిస్తుందని వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. విశేషమేంటి అంటే ఎన్నికల్లో భోగస్ ఓట్లు చేరాయని అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ గుట్టు తేల్చి సాఫీగా ఎన్నికలు జరపాలని కోరుతున్నాయి.