నారా లోకేశ్ పాదయాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆడియో చక్కర్లు కొడుతోంది. ఇవాళ్టి నుంచి చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో పాదయాత్ర మొదలైంది. లోకేశ్ పాదయాత్రపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జీడీనెల్లూరు ఇన్‌చార్జ్ భీమినేని చిట్టిబాబు మధ్య ఫోన్‌లో సాగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది.
ఈ ఆడియోలో ఎక్కడా లేని విధంగా జీడీనెల్లూరులో అత్యధికంగా లోకేశ్ పాదయాత్ర నాలుగు రోజుల పాటు సాగుతుందని అచ్చెన్నతో చిట్టిబాబు చెప్పుకొచ్చారు. పాదయాత్రకు డబ్బులిచ్చి జనాన్ని తరలించి, విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు అచ్చెన్నతో అతను అన్నాడు. ప్రతిరోజూ మూడు వేల మందిని ఆరేంజ్ చేసినట్టు ఆ ఆడియోలో వుంది. లోకేశ్ పాదయాత్రకు స్వచ్ఛందంగా జనం రాలేదని, పార్టీ నాయకులు డబ్బు పెట్టి మరీ తరలిస్తున్నారని అచ్చెన్న, ఆ పార్టీ ఇన్‌చార్జ్ మధ్య సాగిన సంభాషణ తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆడియో సంభాషణనై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశారు. ఈ ఆడియో లీక్ కావడానికి ప్రధాన కారకుడు అచ్చెన్నాయుడే అని ఆయన తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. వర్మ ట్వీట్ ఏంటో చూద్దాం.
“ఈ ఆడియో లీక్ చేసింది 100% అచ్చెంనాయుడే అని నాకు 1000% నమ్మకం.. ఎందుకంటే నారా లోకేశ్ అసలు కెపాసిటీ ఇప్పటికైనా చంద్రబాబునాయుడు తెలుసుకునేలా చేసి తెలుగుదేశం పార్టీ ని కాపాడాలని పన్నిన అచ్చెంనాయుడి వ్యూహం ఇది” అని సంచలన ట్వీట్ చేశారు. అచ్చెన్నాయుడిని వర్మ ఇరికించారు. లోకేశ్ అసమర్థతను ఇటు జనానికి, అటు పార్టీ అధినేతకు తెలియజేయడానికే అచ్చెన్నాయుడు వ్యూహాత్మకంగా ఆడియో లీక్ చేశారని వర్మ చేసిన ట్వీట్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా అచ్చెన్నాయుడిని ఇటీవల కాలంలో వర్మ టార్గెట్ చేశారని చెప్పొచ్చు. పాదయాత్ర ప్రారంభ సభలో పోలీసులపై అవాకులు చెవాకులు పేలిన అచ్చెన్నపై వర్మ విరుచుకుపడ్డారు. ఆ సందర్భంలో అచ్చెన్నను బిచ్చంనాయుడు అంటూ దెప్పి పొడిచారు. తాజాగా ఆడియో లీక్ వ్యవహారంలో అచ్చెన్నను కుట్రదారునిగా చూపేందుకు ప్రయత్నించడం గమనార్హం.