టీడీపీ, జనసేన మధ్య పొత్తు వుంటుందని పవన్‌కల్యాణ్ ప్రకటనతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల చర్చకు తెరలేచింది. పవన్ కల్యాణ్ ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై దృష్టి సారించారు. రాయలసీమలో తనకు అంత సీన్ లేదనే ఉద్దేశంతో దాదాపు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. అందుకే వారాహి మొదట విడత యాత్రను కోస్తా జిల్లాలో మొదలు పెట్టారు. ఆ తర్వాత మూడో విడత యాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించారు.
రాయలసీమలో వైసీపీకి బలం ఉందని, అలాంటి చోట దృష్టి సారించినా పెద్దగా రాజకీయ ప్రయోజనం వుండదనేది పవన్ భావన. రానున్న ఎన్నికల్లో జనసేనాని ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని వ్యూహం రచిస్తున్నారు. అయితే పొత్తు ప్రకటనతో ఎవరెక్కడ? అనే చర్చకు తెరలేచింది. టీడీపీ కూడా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఆశలు పెట్టుకుంది.
ఈ ప్రాంతాల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ మధ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విశాఖ స్థానాన్ని గెలవడాన్ని టీడీపీ గుర్తు చేస్తోంది. అయితే అవే ప్రాంతాల్లో ఎక్కువ సీట్లలో నిలబడాలని జనసేన కోరుకోవడంపై టీడీపీ లోలోపల అసంతృప్తిగా వున్నట్టు సమాచారం. అంతోఇంతో జనసేనకు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే నియోజకవర్గ స్థాయి నాయకులున్నారు. అక్కడైతేనే ఆ పార్టీకి అభ్యర్థులుంటారు. మిగిలిన చోట్ల సీట్లు కేటాయించినా …చివరికి టీడీపీ నుంచి నేతలను చేర్చుకుని టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఉన్న చోట జనసేనకు టికెట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటనేది టీడీపీ నేతల ప్రశ్న. జనసేన కోసం తమ నాయకత్వాల్ని బలి ఇవ్వలేమని టీడీపీ నేతల వాదన. క్షేత్రస్థాయిలో జనసేన ఎప్పుడూ లేదని, ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేసి, సీట్లు కావాలంటే ఎలా అని కొన్ని నియోజకవర్గాల టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.
ప్రధానంగా జనసేన డిమాండ్ చేస్తున్న సీట్లకు సంబంధించి టీడీపీ ఇన్‌చార్జ్‌లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ ఆవేదన, ఆవేశాన్ని టీడీపీ అధిష్టానానికి తెలియజేసినట్టు సమాచారం. అయితే పవన్‌ను ఎలాగైనా చంద్రబాబు మేనేజ్ చేస్తారని, ఏవేవో ఊహించుకుని నోరు పారేసుకోవద్దని టీడీపీ అధిష్టానం తమ ఇన్‌చార్జ్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.