పవన్‌కల్యాణ్‌ను అభిమానిస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తల్ని చూస్తుంటే జనానికి జాలేస్తోంది. ఇంత కాలం చంద్రబాబునాయుడిని జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రమే మోస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో పవన్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలపై భారం పెరిగింది. అలాగే చంద్రబాబుతో పాటు లోకేశ్ పల్లకీని తన వాళ్లతో మోయించే బాధ్యత పవన్‌పై పెరిగింది.
ఈ నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించనున్న విస్తృత సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ, జనసేన మధ్య ఐక్య కార్యాచరణ, నియోజకవర్గాల్లో సమన్వయంపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీతో పొత్తు వల్ల సీట్ల కంటే పవన్ ఆశిస్తున్నది వేరే వుందని ప్రత్యర్థులు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అంటున్నారు.
టీడీపీతో పొత్తు ప్రకటనతో పవన్ భారీగా ఆర్థిక లబ్ధి పొందారని, ఆయన్ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఇవాళ్టి జనసేన విస్తృత సమావేశంలో టీడీపీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపైనే పవన్ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఇంత కాలం వైసీపీ చేస్తున్న ఆరోపణలే నిజమవుతున్నాయని జనసేన నాయకులు కూడా అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారు. మళ్లీ టీడీపీ జెండా మోయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదేం ఖర్మ అని ఆవేదనతో నలిగిపోతున్నారు.
టీడీపీతో పొత్తు వుంటుందని పవన్‌కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆసక్తి నెలకుంది. కనీసం ఎన్ని సీట్లలో తాము నిలబడుతామో, జనసేనను టీడీపీ ఎంత మాత్రం గౌరవిస్తుందో పవన్ నుంచి క్లారిటీ వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇవేవీ లేకుండా కేవలం దత్త తండ్రి, దత్త తమ్ముడి పల్లకీలను మోయాలని దిశానిర్దేశం చేయడంతో సరిపెడతారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే జనసేనకు ఎక్కువ మంది దూరమయ్యే పరిస్థితి వుంటుంది.