విమానం ఎక్కేముందు ఇవి తినకండి..!

ప్రయాణం చేసే ముందు చాలామంది తక్కువ తింటారు. కానీ విమాన ప్రయాణంలో మాత్రం ఎయిర్ పోర్ట్ లో కొంతమంది నోరూరించే వంటకాలను చూస్తూ ఉండలేరు, మరికొందరు సదరు విమానయాన సంస్థలు ఇచ్చే ఉచిత ఫుడ్…

ప్రయాణం చేసే ముందు చాలామంది తక్కువ తింటారు. కానీ విమాన ప్రయాణంలో మాత్రం ఎయిర్ పోర్ట్ లో కొంతమంది నోరూరించే వంటకాలను చూస్తూ ఉండలేరు, మరికొందరు సదరు విమానయాన సంస్థలు ఇచ్చే ఉచిత ఫుడ్ ఐటమ్స్ ని ఓ పట్టుబడతారు. 

అయితే అసలు విమానం ఎక్కేముందు ఏమేం తినకూడదో మీకు తెలుసా..? విమానం ఎక్కేముందు 5 ఆహార పదార్థాలను పూర్తిగా పక్కనపెట్టాలంటున్నారు నిపుణులు. అవి తింటే ప్రయాణానికి పొట్ట సహకరించదని, ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

1. యాపిల్

రోజుకో యాపిల్, డాక్టర్ ని దూరంగా పెడుతుందనేమాట నిజమే. కానీ విమానం ఎక్కేముందు మాత్రం యాపిల్ ని అస్సలు ముట్టొద్దని అంటున్నారు నిపుణులు. యాపిల్ త్వరగా జీర్ణమవ్వదు. యాపిల్ లో ఉండే ఫైబర్, విమాన ప్రయాణంలో అజీర్తికి కారణం అవుతుంది. ఫలితంగా కడుపు నొప్పి వచ్చే అవకాశముంది. అయితే యాపిల్ జ్యూస్ కాస్త పర్వాలేదంటున్నారు. యాపిల్ కాకుండా ఇతర పండ్లు తినొచ్చు, పండ్ల కంటే, ఫ్రూట్ సలాడ్ ఇంకా బెటర్.

2. బ్రొకోలి

విడిగా బ్రొకోలి ఆరోగ్యానికి మంచిది. కానీ విమానం ఎక్కేముందు మాత్రం దాన్ని దూరం పెట్టాలంటున్నారు నిపుణులు. బ్రొకోలితో పాటు కాలిఫ్లవర్, క్యాబేజీ కూడా కడుపులో గ్యాస్ ఉత్పత్తి చేస్తాయని, విమానంలో గడబిడ తప్పదని అంటున్నారు. పచ్చి ఆకుకూరలు తినడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.

3. ఫాస్ట్ ఫుడ్ వద్దు..

సహజంగా ఫాస్ట్ ఫుడ్ మామూలుగానే ఆరోగ్యానికి హానికరం. విమానం ఎక్కేముందు దాన్ని తినడం మరింత ఇబ్బందికరం. వాటిలో ఉండే ఎక్కువ చక్కెర లేదా ఉప్పు, ప్రిజర్వేటివ్స్ వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో ఏది పడితే అది తినకుండా ఇంటి వద్ద నుంచే ఆహార పదార్థాలను తీసుకెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు.

4. కాఫీ

చాలామందికి కాఫీ అలవాటు. ప్రయాణంలో కాఫీలు తాగడం మరింత సరదా. తెల్లవారు ఝామున, లేట్ నైట్ ఫ్లైట్స్ లో వెళ్లేవారు నిద్రమత్తు పోయేందుకు కాఫీ తాగుతుంటారు. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అందుకే విమానాలు ఎక్కేముందు కాఫీ వద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు.

5. బీన్స్..

చిక్కుళ్లు, ఇతర గింజల జాతికి చెందిన ఆహార పదార్థాలను తింటే కడుపులో గ్యాస్ ఉత్పత్తి కావడంతో పాటు, ఎసిడిటీ కూడా పెరిగే అవకాశముంది. అందులోనూ విమాన ప్రయాణాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అందుకే విమానం ఎక్కేముందు బీన్స్ ని దూరంగా పెట్టాలంటున్నారు.

విమాన ప్రయాణాలు చేసేవారు చాలా వరకు తొందరగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోవాలి. అందులోనూ వాటిని మితంగా తీసుకోవాలి. అప్పుడే మీ విమాన ప్రయాణం సుఖంగా సాగుతుంది.