రిటెన్ష‌న్ త‌ర్వాత‌.. ఎవ‌రి రేటు ఎన్ని కోట్లంటే!

ఐపీఎల్ రిటెన్ష‌న్ ప్ర‌క్రియ దాదాపు పూర్త‌య్యింది. గ‌రిష్టంగా న‌లుగురు ఆట‌గాళ్ల‌ను త‌మ వ‌ద్దే అట్టే పెట్టుకునే అవ‌కాశం ఉన్న ఐపీఎల్ టీమ్ లు త‌మ‌కు న‌చ్చిన వారిని ఎంచుకున్నాయి. వేలం ధ‌ర‌తో నిమిత్తం లేకుండా…

ఐపీఎల్ రిటెన్ష‌న్ ప్ర‌క్రియ దాదాపు పూర్త‌య్యింది. గ‌రిష్టంగా న‌లుగురు ఆట‌గాళ్ల‌ను త‌మ వ‌ద్దే అట్టే పెట్టుకునే అవ‌కాశం ఉన్న ఐపీఎల్ టీమ్ లు త‌మ‌కు న‌చ్చిన వారిని ఎంచుకున్నాయి. వేలం ధ‌ర‌తో నిమిత్తం లేకుండా వారికి భారీ ఆఫ‌ర్లతో కాంట్రాక్ట్ ను ఇచ్చాయి. 

మ‌ళ్లీ వేలానికి వెళితే వారికి ఎంత వ‌చ్చేదో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేనిది కానీ.. ఆట‌గాళ్లు కూడా త‌మ ప్రాంచైజ్ మొత్తాల‌కు ఒప్పుకున్నారు. అయితే త‌మ‌కు అన్ని విధాలా సెట్ అయ్యే ఆట‌గాళ్ల‌నే యాజ‌మాన్యాలు అట్టే పెట్టుకున్నాయ‌ని స్ప‌ష్టం అవుతూనే ఉంది. 

వారి బ్రాండ్ వ్యాల్యూ త‌మ‌కు ప్ల‌స్ అయ్యే ఆట‌గాళ్ల‌నూ, కెప్టెన్సీకి స‌రిపోతార‌నుకునే వారికి ఎక్కువ ప్రాధాన్య‌త ద‌క్కింది. ఈ లెక్క‌ల‌న్నింటి త‌ర్వాత‌.. ఐపీఎల్ లో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడుగా నిలుస్తున్నాడు రోహిత్ శ‌ర్మ‌. 

ఇటీవ‌లే టీమిండియా టీ20 కెప్టెన్ గా కూడా ఎంపికైన శ‌ర్మ ఇప్ప‌టికే ప‌లుద‌ఫాలు  ముంబై జ‌ట్టును విజేత‌గా నిలిపిన కెప్టెన్ గా నిలిచాడు. ఈ క్ర‌మంలో శ‌ర్మ‌ను రీటైన్ చేసుకుంది ముంబై ఇండియ‌న్స్. ప‌ద‌హారు కోట్ల రూపాయ‌ల మొత్తానికి రోహిత్ శ‌ర్మ కొత్త కాంట్రాక్ట్ కుదిరిన‌ట్టుగా స‌మాచారం.

శ‌ర్మ‌తో పాటు మ‌రో ముగ్గురు ఆట‌గాళ్ల‌ను రీటైన్ చేసుకుంది రిల‌య‌న్స్ జ‌ట్టు. బుమ్రాను 12 కోట్ల‌కు, సూర్య‌కుమార్ యాద‌వ్ ను ఎనిమిది కోట్ల మొత్తానికి, పొలార్డ్ ను ఆరు కోట్ల రూపాయ‌ల మొత్తానికి ఈ జ‌ట్టు రీటైన్ చేసుకుంది.

బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నా కొహ్లీని ఆ జ‌ట్టు అలాగే పెట్టుకుంది. ప‌దిహేను కోట్ల రూపాయ‌ల మొత్తానికి కొహ్లీతో ఆ జ‌ట్టు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మ్యాక్స్ వెల్ ను 11 కోట్ల‌కు, సిరాజ్ ను ఏడు కోట్ల రూపాయ‌ల మొత్తానికి బెంగ‌ళూరు జ‌ట్టు రీటైన్ చేసుకుంది.

పంజాబ్ జ‌ట్టు మ‌యాంక్ అగ‌ర్వాల్ ను 12 కోట్ల రూపాయ‌ల‌కు, అర్ష‌దీప్ సింగ్ ను నాలుగు కోట్ల రూపాయ‌ల మొత్తానికి రీటైన్ చేసుకుంది. ఈ జ‌ట్టు కేఎల్ రాహుల్ ను రీటైన్ చేసుకుంద‌నే అంచ‌నాలున్నా.. అవి నిజం కాలేదు.

హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు.. వార్న‌ర్ వ‌దులుకుంది. అయితే కేన్ విలియ‌మ్స‌న్ ను 14 కోట్ల రూపాయ‌ల మొత్తానికి రీటైన్ చేసుకుంది. దేశ‌వాళీ ఆట‌గాళ్లు స‌మ‌ద్, ఉమ్రాన్ మాలిక్ ల‌ను నాలుగు కోట్ల రూపాయ‌ల చొప్పున ధ‌ర‌తో స‌న్ రైజ‌ర్స్ రీటైన్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే అఫ్గానిస్తాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ ను కూడా ఈ జ‌ట్టు వ‌దిలేసుకుంది.

త‌మ పూర్తి కోటా మేర ఆట‌గాళ్ల‌ను రీటైన్ చేసుకుంది చెన్నై జ‌ట్టు. ర‌వీంద్ర‌జ‌డేజాను ప‌ద‌హారు కోట్ల రూపాయ‌ల‌కు, ధోనీని ప‌న్నెండు కోట్ల రూప‌యాల‌కు, మొయిన్ అలీని ఎనిమిది కోట్ల మొత్తానికి, రుతురాజ్ గైక్వాడ్ ను ఆరు కోట్ల రూపాయ‌ల మొత్తానికి ఆ జ‌ట్టు రీటైన్ చేసుకుంది. 

ఢిల్లీ జ‌ట్టు కూడా త‌మ కోటాను వాడుకుంది. రిష‌బ్ పంత్ ను ప‌ద‌హారు కోట్ల రూపాయ‌ల‌కు,  అక్ష‌ర్ ప‌టేల్ ను తొమ్మిది కోట్ల మొత్తానికి, పృథ్వీషా ను ఏడున్న‌ర కోట్ల‌కు, నోర్ట్జేను ఆరున్న‌ర కోట్ల రూపాయ‌ల ధ‌ర‌కు ఈ జ‌ట్టు రీటైన్ చేసుకుంది.

పూర్తి కోటాను వాడుకున్న కోల్ క‌తా జ‌ట్టు.. ర‌స్సెల్ ను ప‌న్నెండు కోట్ల మొత్తానికి, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని ఎనిమిది కోట్ల‌కు, వెంక‌టేష్ అయ్య‌ర్ ను అదే ధ‌ర‌కు, సునిల్ న‌రైన్ ను ఆరు కోట్ల మొత్తానికి రీటైన్ చేసుకుంది.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సంజూ సామ్స‌న్ ను ప‌ద్నాలుగు కోట్ల రూపాయ‌ల‌కు, జోస్ బ‌ట్ల‌ర్ ను ప‌ది కోట్ల‌కు, యశ‌స్వి జైస్వాల్ ను నాలుగు కోట్ల రూపాయ‌ల ధ‌ర‌కు రీటైన్ చేసుకుంది.