ఒమిక్రాన్ అంటూ మీడియా హడావుడి చేసే వరకూ కరోనా భయాలను పక్కన పెట్టిన జనాలు, కనీస జాగ్రత్త చర్యలను కూడా తీసుకుని ప్రజలు, ప్రభుత్వాలు.. ఇప్పుడు దాన్నొక మానసిక వ్యాధిగా మార్చేసుకుంటున్నారు! గొంతులో కాస్త ఇన్ఫెక్షన్ పెయిన్ మొదలైతే చాలు… అది ఒమిక్రానేనేమో అంటూ డాక్టర్లకు ఫోన్లు చేస్తున్న జనాలు అప్పుడే తయారయ్యాయంటే, ఒమిక్రాన్ మానసికంగా ఎంత ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఆల్రెడీ కరోనా భయాంకరమైన పరిస్థితులను చూపించి వెళ్లింది. నూటికి 99 శాతం రికవరీ రేటు ఉన్నప్పటికీ.. కేసుల సంఖ్య భారీగా నమోదు కావడంతో .. ఆ ఒక్క శాతమే రికవరీ కాలేకపోవడమే భయంకరంగా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు కరోనాలో కొత్త వేరియెంట్ అంటే ప్రజలు తేలికగా భయపడతారు! దానికి తోడు 24 గంటల వార్తా చానళ్లను చూసే వారి మానసిక స్థితి మరీ భయంకరంగా ఉండవచ్చు! వీటికి తోడు సోషల్ మీడియా ప్రచారాలు!
బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ పెట్టారంటూ వాట్సాప్ లో ఒక వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి అది కొత్త వీడియో కాదు. ఫస్ట్ వేవ్ సమయంలోనో.. సెకెండ్ వేవ్ సమయంలోదో! దాన్ని కాస్త ఎడిట్ చేసి.. బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ అంటూ.. వైరల్ చేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు!
ఈ విషయంలో చిన్న చిన్న పట్టణాలను కూడా జనాలు వదలడం లేదు. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ సమయాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, పట్టణాలకు ఆంక్షలను జారీ చేయడానికి సంబంధించిన వీడియోలను ఇప్పుడు వైరల్ చేసి.. కొంతమంది ఆనందం పొందుతుంటారు.
వాస్తవానికి ఒమిక్రాన్ ను డిటెక్ట్ చేసిన దక్షిణాఫ్రికాలో పరిస్థితులకూ ఇతర దేశాల్లో పరిస్థితులకూ చాలా తేడా ఉండవచ్చని వైద్య పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కరోనా ఇప్పటి వరకూ ఏ దేశానికాదేశంలో ప్రత్యేకంగా ప్రవర్తించింది. యూరోపియన్, అమెరికాలతో పోలిస్తే.. ఆసియా, ప్రత్యేకించి ఇండియన్ సబ్ కాంటినెట్ ఏరియాలో కరోనా సోకినా.. మరణాల రేటు చాలా తక్కువ. మన పక్కనున్న శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో అయితే.. కరోనా భయానక పరిస్థితులను కూడా క్రియేట్ చేయలేకపోయింది!
ఒమిక్రాన్ కు ముందు కూడా.. కొన్ని యూరప్ దేశాల్లో భారీ సంఖ్యలో కేసులు వచ్చాయి. అయితే ఇండియాలో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా లేదు. ఈ పరిస్థితులను ఎవరికి వారు కూడా గమనించుకోవచ్చు. ఇప్పుడు ఒమిక్రాన్ విజృంభిస్తోంది అంటున్న దక్షిణాఫ్రికా తీరునే, ఆ వేరియెంట్ ఇతర దేశాల్లోనూ, ఇతర ఖండాల్లోనూ విజృంభించాలని ఏమీ లేదు.
వాస్తవానికి దక్షిణాప్రికన్లే చెబుతున్నారు.. మైల్డ్ సింప్టమ్స్ అని! అయితే వేగంగా వ్యాపిస్తోంది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వేరియెంట్లే వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే.. సింప్టమ్స్ ను గుర్తించే లోపే అది ఒక వ్యక్తినుంచి మరో వ్యక్తికి చేరిపోవచ్చు. అందుకే ఇలాంటి తక్కువ ప్రభావం ఉన్న వేరియెంట్లు వేగంగా వ్యాపిస్తాయని వారు అంటున్నారు.
అలాగే దక్షిణాఫ్రికాలో ఇది వరకూ భారీ ఎత్తున కేసులు వచ్చినా.. వ్యాక్సినేషన్ మాత్రం పెద్దగా జరగలేదట. కేవలం పాతిక శాతం ప్రజలకు కూడా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదట. ఈ నేపథ్యంలో కూడా అక్కడ వేగంగా వ్యాప్తి ఉండొచ్చేమో అనుకోవచ్చు! ఏతావాతా.. ఈ వేరియెంట్ గురించి ఇంతే అని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
అయితే వార్తా చానళ్ల అతి పుణ్యమా అని.. పదే పదే చెప్పిందే కొత్త రకంగా, మరింత భయంకరం చేసి చెప్పడం వల్ల.. కొందరిలో మానసికంగా ఒమిక్రాన్ భయంకరంగా మారుతోంది. ఇదొక మానసిక వ్యాధిగా మారుతోంది. దీనికి రెమిడీ.. వార్తా చానళ్లను చూడటం పూర్తిగా మానేయడమే కావొచ్చు!