బ్రహ్మానందం సినిమాలు తగ్గించేశారు. ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయి. ఈ రెండు వాక్యాల్లో ఏది నిజం. బ్రహ్మానందం మాత్రం మొదటి వాక్యమే నిజం అంటున్నారు. తనకు అవకాశాలు తగ్గలేదని, తనంతట తానుగా అవకాశాలు తగ్గించుకున్నానని ప్రకటించారు. కెరీర్ ఆపలేదని, తన శరీరానికి మాత్రం కాస్త విశ్రాంతి ఇచ్చానని చెప్పుకొచ్చారు.
“బ్రహ్మానందం 9 గంటలకు వస్తారు 6కి వెళ్లిపోతారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 వరకు రారు అని అందరూ అంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే, 35 ఏళ్లుగా రోజుగా 3-4 షిఫ్టులు పనిచేశాను. ఒక రోజులో 3 రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇలా తినీతినక, తిన్నది అరగక వాంతులు చేసుకున్న రోజులున్నాయి. ఇలా చేసి మళ్లీ రాత్రిళ్లు డబ్బింగ్ చెప్పి, మళ్లీ తెల్లారి 5 గంటలకు లేచి షూటింగ్ కు వెళ్లాను. ఇంత కష్టపడిన శరీరానికి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. షూటింగ్ చేస్తే డబ్బులొస్తున్నాయనే కోరికను కొంచెం తగ్గించుకున్నాను. అలా నన్ను నేను తగ్గించుకొని, శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాను.”
ఇలా తన కెరీర్ గ్యాప్ పై డిఫరెంట్ గా స్పందించారు బ్రహ్మానందం. ప్రస్తుతం చేతిలో సినిమాల్లేకపోయినా, మీమ్స్ రూపంలో తను ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నానని అన్నారు.
“నాపై మీమ్స్ చేసే వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నాను. వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే, నేను ఈమధ్య సినిమాల్లో నటించడం లేదు. కానీ నన్ను జనాలు మరిచిపోకుండా చేస్తోంది మీమ్స్ క్రియేటర్స్. నేను చేసిన సినిమాల్లో ఎక్కడ ఏ ఎక్స్ ప్రెషన్ ఉందో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే.”
ప్రస్తుతం సినిమాల కోసం కాకుండా, తన కోసం తాను బతుకుతున్నానని, ఇష్టమైన పెయింటింగ్స్ గీస్తున్నానని, మనవడితో ఆడుకుంటున్నానని తెలిపారు. తన టైమింగ్స్, టైమ్ టేబుల్ నచ్చి ఎవరైనా ఆఫర్లతో ముందుకొస్తే అడపాదడపా నటిండడానికి సిద్ధమంటున్నారు బ్రహ్మి.