దిశ హత్యకేసులో నలుగురు కీచకులు ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగుతుందనే విషయం కూడా తెలిసిందే. ఇప్పుడదే జరిగింది.
ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఆ నలుగురు మృతదేహాలను పరిశీలించనుంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఆ మృతదేహాల్ని పరిశీలించిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్తారు సభ్యులు.
ఎన్ కౌంటర్ కు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీచేసింది. అయితే ఎన్ కౌంటర్ జరిగిన స్పాట్ లోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాతే మృతదేహాల్ని తరలించారు.
మరోవైపు తెలంగాణ పోలీసులు ఈరోజు మరోసారి ఘటనాస్థలానికి వెళ్తున్నారు. ఎన్ కౌంటర్ సమయంలో నిందితులకు తగలకుండా బయటకు వెళ్లిన బుల్లెట్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మిగతా వాటి కోసం ఈరోజు గాలిస్తారు.
నిందితులు తమపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారని.. తుపాకులు లాక్కొన్ని కాల్పులకు యత్నించారని.. లొంగిపోవాలని హెచ్చరించినా వినకపోవడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఎన్ కౌంటర్ పై ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. పైపెచ్చు పోలీసులపై పూలవర్షం కూడా కురిపించారు.
కానీ చట్ట ప్రకారం చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. నిందితుడు రాక్షసుడైనా అకారణంగా చంపడం నేరం. అందుకే మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. అటు దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ప్రశంలు కురుస్తున్నాయి. తాజాగా హరియాణాకు చెందిన రహ్ గ్రూప్, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతి పోలీసుకు లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించింది.