Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆనం ఫైర్ వెనక అసలు కారణాలు ఇవే!

ఆనం ఫైర్ వెనక అసలు కారణాలు ఇవే!

వైసీపీలో మంత్రి పదవులు రాని సీనియర్లు చాలామంది ఉన్నారు. జగన్ తన టీమ్ ని ప్రకటించిన రోజే వీరిలో కొంతమంది తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. తమకి పదవి రాకపోవడం ఒకటి, జిల్లాలో తమకంటే జూనియర్లకు పదవీ వైభోగం దక్కడం మరొకటి. ఈ రెండు కారణాలే వీరి అసంతృప్తికి ప్రధాన కారణాలు. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వీరిలో ఒకరు.

వైఎస్ఆర్ హయాంలో, ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ లలో కూడా ఆనం కీలక భాగస్వామి. సహజంగానే జగన్ టీమ్ లో కూడా మంచి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆనంకు పదవి దక్కలేదు. కానీ అదే జిల్లాలో యువకులైన అనిల్, గౌతమ్ రెడ్డికి కీలక పోర్టుఫోలియోలు లభించాయి. దీంతో సహజంగానే ఆనం కుళ్లుకున్నారు.

తాజాగా నెల్లూరు నగరంలో ఇసుక, లిక్కర్, బెట్టింగ్ మాఫియాలున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఎస్పీ బదిలీపై కూడా ఆయన కామెంట్ చేశారు.  పనిచేసే ఎస్పీలను బదిలీ చేస్తుంటారని, దానికి కారణం స్థానిక ఎమ్మెల్యేలేనంటూ ఆరోపించారు. ప్రస్తుతం ఆనం వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ప్రతిపక్షాలు ముఖ్యంగా జనసేన ఆనం ప్రెస్ మీట్ ని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తోంది. అయితే మంత్రి పదవి దక్కకపోవడం కంటే ఆ తర్వాత జిల్లాలో జరిగిన పరిణామాలే ఆనంలో ఆగ్రహానికి కారణం.

నెల్లూరులో వెంకటగిరి రాజాలు ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు ఆనం కుటుంబీకులు చైర్మన్ లుగా ఉంటూ వచ్చారు. ఇటీవల మంత్రి అనిల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విద్యాసంస్థల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు, ఆనం ప్రాభవాన్ని తగ్గించేశారు. స్థానికంగా ఓ దేవాలయానికి ఆనం కుటుంబీకులు ధర్మకర్తలుగా ఉండేవారు, ఇప్పుడిది దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తోంది. దీనికి కూడా మంత్రి, ఎమ్మెల్యేనే కారణం అని భావిస్తున్నారు ఆనం.

ఇక ఆనం సొంత నియోజకవర్గం వెంకటగిరి పరిధిలో జరగాల్సిన 200 కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులను ఆనం వర్గీయులు మొదలు పెడతారనుకుంటున్న టైమ్ లో మంత్రి అనిల్ వాటిని రివర్స్ టెండరింగ్ కి పంపించారు. ఇక్కడ కూడా ఆనం అహం దెబ్బతింది. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మంత్రి అనిల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ మాఫియాలు అంటూ చెలరేగిపోయారు.

దీనిపై జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఆనం వ్యవహారంపై నెల్లూరు జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని ఇప్పటికే వివరణ అడిగారు జగన్. ఇక ఆనంను అమరావతికి పిలిపించడమే మిగిలింది. ఇటీవలే నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సీఎం జగన్ పంచాయితీ తీర్చారు. ఇప్పుడు మరొకటి. ఆనం ప్రసంగాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని త్వరగా ముగించాలని చూస్తున్నారు సీఎం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?