టీటీడీలో ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. సీఎం జగన్‌కు కూడా తలనొప్పి వ్యవహారంగా తయారైంది.
టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ కన్నా పైస్థాయి ఉద్యోగాల కోసం ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈఓ అశోక్‌సింఘాల్ తెలిపారు. ఇలాంటివి 200 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామన్నారు.
అంతేకాకుండా టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి లోపు ఉద్యోగాల్లో చిత్తూరు జిల్లాకు 75 శాతం రిజర్వేషన్ చేయాలని తీర్మానిస్తూ ప్రభుత్వానికి పంపామని, అక్కడి నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉందని ఆయన అన్నారు.
ఈవో చెప్పడాన్ని బట్టి 75 శాతం రిజర్వేషన్‌పై జగన్ సర్కార్ స్పష్టత ఇచ్చిన తర్వాత వాటిని కూడా భర్తీ చేస్తారని అర్థం చేసుకోవాలి. జగన్ సర్కార్‌కు అసలు పరీక్ష ఇక్కడే ఎదురుకానుంది.
టీటీడీలో భర్తీ చేసే జూనియర్ అసిస్టెంట్ స్థాయి లోపు ఉద్యోగాల్లో చిత్తూరు జిల్లాకు పెద్దపీట వేయాలని, 75 శాతం ఉద్యోగాలను జిల్లా వాసులకే రిజర్వ్ చేసేలా నిర్ణయం తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఓ ప్రతిపాదనను టీటీడీ బోర్డు ముందుకు తెచ్చాడు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా టీటీడీలో 75 శాతం ఉద్యోగాలను చిత్తూరు జిల్లా వాసులకు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చాడు. తన హామీని నెరవేర్చుకునే క్రమంలో ఆయన టీటీడీ బోర్డు మీటింగ్‌లో ఈ ప్రతిపాదన చేశాడు. దాన్ని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించి ప్రభుత్వానికి పంపారు.
టీటీడీ బోర్డు నిర్ణయంపై రాయలసీమలోని మిగిలిన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని యువత తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తిరుమల శ్రీవారు కేవలం చిత్తూరు జిల్లా వాసుల సొంతం కాదని, వెనుకబడిన తమ మూడు జిల్లాల నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తీవ్ర దుర్భిక్షం కారణంగా అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకుని కేరళ, బెంగళూరు, పూణె, ముంబయ్, అరబ్ దేశాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం చిత్తూరు జిల్లాకే 75 శాతం ఉద్యోగాలను ఇవ్వాలని తీర్మానిస్తూ ప్రభుత్వానికి పంపడం ఏంటని వారు నిలదీస్తున్నారు.
2014లో రాష్ర్టమంతా జగన్‌ను కాదనుకుంటే రాయలసీమ అక్కున చేర్చుకుందని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. 2019లో కూడా 52 సీట్లలో 49 చోట్ల వైసీపీ అభ్యర్థులను గెలిపించారని, కనీసం ఆ విశ్వాసంతోనైనా చిత్తూరుతో పాటు మిగిలిన మూడు జిల్లాల వారికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఒకవేళ బోర్డు తీర్మానాన్ని ఆమోదిస్తే మాత్రం జగన్‌కు సినిమా చూపుతామని వారు హెచ్చరిస్తున్నారు.
రాయలసీమ నిరుద్యోగుల అభిప్రాయాలను, వెనకుబాటుతనాన్ని, పేదరికాన్ని పరిగణలోకి తీసుకుని సరైన నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని పలువురు విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.