అవును, ఈ ప్రశ్నకు జవాబు చెప్పి తీరాల్సిందే. న్యాయం, చట్టం అంగడి సరుకైనప్పుడు, వాటిని కొనలేని ఆర్థిక స్తోమత లేని వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఇలాగే ఉంటాయి.
దిశలో ఓ మహిళ బాధితురాలు. ఆమె ప్రాణాలు పోగొట్టుకొంది. ఈ అమానుష ఘటనలో నిందితుల్లో ఒకడి భార్య పైన పేర్కొన్న ప్రశ్న వేస్తోంది. ఎందుకంటే ఆమె కూడా బాధితురాలే. ఎలా చూసినా చివరికి మహిళలే బాధితులుగా మిగులుతున్నారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం మృతుడు చెన్నకేశవుల భార్య న్యాయం కోసం రోడ్డెక్కింది. తాను ఏడునెలల గర్భవతిని అని, తనను కూడా భర్తతో పాటు పూడ్చేయాలని రోదిస్తూ వేడుకోవడం చూపరులను కలచివేసింది. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ పోలీసులను, సమాజాన్ని ఓ ప్రశ్న వేసింది.
“డబ్బున్న వారికో న్యాయం? మాకో న్యాయమా? . ఎంపీ, ఎమ్మెల్యే కొడుకులనూ ఇలాగే చంపుతారా?” అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఆమెకు బంధువులు మద్దతుగా నిలిచి మక్తల్ రోడ్డుపై బైఠాయించారు. తమవారి మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అత్యాచారాలు చేసినవాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లను జైళ్లలో కుక్కల్లా మేపుతున్నారని మృతుడి భార్య ఆరోపించింది. తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తాడని అనుకున్నానని రోదిస్తూ చెబుతుండడం గమనార్హం.
ప్రశ్నించింది ఎవరనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి…ఏం ప్రశ్నించిందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టాలను, న్యాయాలను డబ్బు శాసిస్తున్న కాలంలో శ్వాస తీసుకుంటున్న ఓ అతిసామాన్య యువతి నిస్సహాయత నుంచి పుట్టుకొచ్చిన ప్రశ్నకు జవాబివ్వాలి.
నిందితుడి భార్య వేసిన ప్రశ్నను మాత్రం ఎన్‌కౌంటర్ చేయొద్దని మనవి. ఎందుకంటే ఆమె కూడా బాధితురాలే. ఆమె కూడా మహిళే. కాకపోతే ఆమె పేదరికానికి, సమాజ ప్రేమకు నోచుకోని అభాగ్యులకు ఓ ప్రతినిధి.