రాను రాను జర్నలిజం వెర్రిపుంతలు తొక్కుతోంది. వార్తలు సేకరణ కన్నా అపహరణ అన్నది ఎక్కువుగా వుంది. ఒకటి అని ఎవరో అంటే రెండు అనడం..మరొకరు నాలుగు అనడం ద్వారా తమ స్వంత కవిత్వం అనే భ్రమ కల్పించాలనే తాపత్రయం తప్ప, వార్త సేకరణ మీద దృష్టి తగ్గిపోతోంది. ఇలా పెడధోరణి పట్టడం వల్ల వార్త అర్థం, పరమార్థం మారిపోతోంది. నిన్నటికి నిన్న ఓ వార్త ఇలాగే వైరల్ అయిపోయింది.
‘వారం పది రోజుల క్రితం ప్రభాస్ కు కాస్త జ్వరం వచ్చింది. దాని వల్ల ఈ నెలలో జరగాల్సిన ఓ సినిమా షెడ్యూలు జరగలేదు’ ఇదీ ట్విట్టర్ లో వచ్చిన మ్యాటర్.
దీన్ని పట్టుకుని ఘనత వహించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెయిన్ చానెళ్లు అన్నీ కూడా తమ తమ కల్పనాచాతుర్యం వాడేసి వార్తలు వండేసాయి. తమ తమ కవిత్వం వాడేసి హెడ్డింగ్ లు పెట్టేసాయి. ప్రభాస్ కు తీవ్ర అస్వస్థత అని ఒకరు. తీవ్ర అనారోగ్యం అని ఇంకొకరు. ఇలా. వారం రోజుల క్రితం వచ్చి తగ్గిపోయిన జ్వరాన్ని తీవ్ర అస్వస్థతగా మార్చేసారు.
ఏవో చిన్న పత్రికలు, చిన్న మీడియా సంస్థలు, లేదా బతుకు తెరువు యూ ట్యూబ్ చానెళ్లు ఇలా చేసాయంటే పోనీలే అనుకోవచ్చు. మెయిన్ చానెళ్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్ సైట్లు కూడా ఇలా చేయడం అంటే భావ దారిద్ర్యం అనుకోవాలా? వార్తా సేకరణ అంటే అంత బద్దకమైపోయింది అనుకోవాలా? ట్విట్టర్ ముందేసుకుని కాపీ, పేస్ట్ చేసుకుంటే చాలు పనైపోతుందనే భావన పెరుగుతోంది అనుకోవాలా?