ప్రభుత్వ పథకాల నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఎప్పుడూ వినిపించేవే. పక్కదారి అంటే అనర్హులకు అందుతున్నాయి అని అర్థం. కానీ ఇక్కడ ఆ ఆర్థిక సాయం అందుకున్న తర్వాతే ఐదుగురు మహిళలు పక్కదారి పట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకుని ప్రియుళ్లతో కలిసి ఉడాయించారు. ఒకే ఊరిలో జరిగిన ఈ వరుస సంఘటనలు సంచలనంగా మారాయి.
అసలేం జరిగిందంటే..?
ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో 40మంది మహిళలను కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. వారికి ఇల్లు కట్టుకోడానికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. తొలి విడతగా 50వేల రూపాయలు వారి అకౌంట్లలో జమ చేశారు. ఆర్థిక సాయం అందిన మరుసటి రోజే ఆ 40మందిలో ఐదుగురు కనిపించకుండా పోయారు. అసలు సంగతి ఏంటా అని ఆరా తీస్తే.. ఆ ఐదుగురు తమ ప్రియుళ్లతో కలసి ఊరి వదిలిపెట్టి పారిపోయారని తేలింది.
అప్పటికే పెళ్లై పిల్లలతో జీవనం సాగిస్తున్న మహిళలు కొంతకాలంగా ప్రియుళ్లతో వ్యవహారం నడుపుతున్నారు. అయితే వారితో కలసి వెళ్లిపోయేందుకు ఆర్థిక స్థోమత సరిపోలేదు. ఊరుకాని ఊరు.. పారిపోయినా పనిలో కుదురుకుని జీతం డబ్బులు చేతిలో పడే వరకు కూడు-నీడ కావాల్సిందే.
అందుకే వారు ఎదురు చూశారు. ప్రధాన మంత్రి వారికి వెలుగు రేఖలా కనిపించారు. పీఎం ఆవాస్ యోజన సాయం అందుకుని ఉడాయించారు. ఐదుగురు మహిళలు పథకం ప్రకారమే తమ ప్రియుళ్లను తీసుకుని పారిపోయారు. వీరికోసం ఇప్పుడు భర్తలు వెదుకుతున్నారు.
ఆ 50 వేలతో పోతే పోయారు.. మిగతా సొమ్ము అయినా వారి ఖాతాల్లో జమ చేయొద్దని వేడుకుంటున్నారు భర్తలు. ప్రధాన మంత్రి కిసాన్ ఆవాస్ యోజన వారికి అలా ఉపయోగపడిందనమాట.