గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాజకీయాలలో తీవ్ర దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు.
ఇవాళ మీడియా సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. నేరుగా వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాన్నని.. ట్యాపింగ్ జరిగిందని అంటుంటే వైసీపీ నేతలు, మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. నేను ఆరోపణలు చేసినప్పుడు సరైన పద్దతితో సమాధానం ఇవ్వాలని సూచించారు. నాపై శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని.. పోలీసు కేసులు కొత్తవి కాదని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్యెల్యేగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించాను అని అంటూనే.. ఇప్పుడు నియోజకవర్గంలో చాలా చోట్ల రోడ్లు అధ్వాన్నంగా ఉన్నయని, రోడ్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నరని, సీఎం జగన్ హామీ ఇచ్చిన పనులకు కూడా నెలలు గడుస్తున్నా పరిష్కారం దొరకడం లేదని అందుకే సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్, 25న ఆర్ ఆండ్ బీ శాఖ కార్యాలయం ముందు దర్నా చేస్తాం అంటూ కోటంరెడ్డి ప్రకటించారు.