భూకంపాల టర్కీ.. ప్రకృతి విధించిన శాపం ఇది

టర్కీలో భూకంపం వచ్చింది. ప్రపంచ దేశాలకు ఇది వార్తేమో కానీ, టర్కీ ప్రజలకు, స్థానికులకు మాత్రం అదేమంత పెద్ద వార్త కాదు. ఆ మాటకొస్తే టర్కీలో ఏడాదికి వేలకొద్దీ భూకంపాలు ఏర్పడతాయి. 2020లో ఏకంగా…

టర్కీలో భూకంపం వచ్చింది. ప్రపంచ దేశాలకు ఇది వార్తేమో కానీ, టర్కీ ప్రజలకు, స్థానికులకు మాత్రం అదేమంత పెద్ద వార్త కాదు. ఆ మాటకొస్తే టర్కీలో ఏడాదికి వేలకొద్దీ భూకంపాలు ఏర్పడతాయి. 2020లో ఏకంగా అక్కడ 33వేల సార్లు భూమి కంపించింది. అందులో 332 సార్లు 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించింది.

అసలు టర్గీలో 95శాతం భూమి భూకంప జోన్ లో ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. అయితే ఈసారి వచ్చిన భూకంపం గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రతతో వచ్చింది. టర్కీతో పాటు సిరియాని కూడా నేలమట్టం చేసింది.

భూకంపాల కేంద్రం టర్కీ..

టర్కీలో ఎక్కువ భాగం అనటోలియన్ టెక్టోనిక్ ప్లేట్‌ లో ఉంది. ఈ ప్లేట్ యురేషియన్, ఆఫ్రికన్, అరేబియన్ ప్లేట్ల మధ్య ఉంది. ఆఫ్రికన్, అరేబియా ప్లేట్లు సర్దుబాటుకి గురైనప్పుడు టర్కీకి ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి లోపల చాలా పెద్ద మొత్తంలో విడుదలైన శక్తి టర్కీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, అణు బాంబులకు సమానమైన శక్తి విడుదల అవుతుంది. దీని ఫలితంగా అతిపెద్ద వినాశనం జరుగుతుంది. ఇప్పుడు టర్కీ భూమి పొరల్లో అలాంటి వినాశనమే జరిగింది. ఫలితంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. తాజాగా వచ్చిన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు ఏమాత్రం ఆగలేదు. రిక్టర్‌ స్కేల్‌పై 4 అంతకంటే ఎక్కువ తీవ్రతతో 100 సార్లు టర్కీలో భూమి కంపించింది.

హిరోషిమా అణుదాడిని మించి..

టర్కీలో భూకంప ప్రధాన కేంద్రం దాదాపు 18 కిలో మీటర్ల లోతులో ఉందని, అందుకే ఈ స్థాయిలో వినాశనం జరిగిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే, భూకంప కేంద్రం ఉపరితలానికి చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. అందుకే ఇంత భారీ నష్టం.

హిరోషిమాలో అణు దాడి కంటే 7 రెట్లు ఎక్కువ తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. 32 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది. 1939 డిసెంబర్లో టర్కీలో వచ్చిన భూకంపం తీవ్రత 8. ఆ దెబ్బకు అప్పట్లోనే 20వేలమంది చనిపోగా.. 1,16,720 బిల్డింగ్ లు నేలమట్టం అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.

ఆ తర్వాత ఇంచుమించి ఆ స్థాయిలోనే ఇప్పుడు భూకంపం వచ్చింది. 5 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వేలాదిమంది క్షతగాత్రులుగా మారారు. మరింతమంది నీడలేని వారయ్యారు.

ఇది టర్కీ చేసుకున్న పాపం కాదు, టర్కీకి ప్రకృతి విధించిన శాపం. కానీ ఆ శాపగ్రస్త దేశంలో ఉన్నవారంతా భూకంపాలకు అలవాటు పడే బతుకుతున్నారు. కానీ ఈసారి దాని తీవ్రత పెచ్చుమీరింది. టర్కీని నేలమట్టం చేసింది.