నారా లోకేశ్‌లో అందరికీ నచ్చే అంశం ఒకటుంది. అది అమాయకత్వం, అజ్ఞానం. లోకేశ్ స్వభావం టీడీపీ శ్రేణులకి అమాయకత్వంగా, ప్రత్యర్థులకి అజ్ఞానంగా కనిపిస్తుంటుంది. ఈ రెండింటిలో ఏదైనా… ముద్దుముద్దుగా ఆయన నిజాలు మాట్లాడుతుంటారు. పాదయాత్రలో ఈ లక్షణమే లోకేశ్‌కు ప్రత్యేకంగా అభిమానుల్ని సంపాదించి పెడుతోంది. ముఖ్యంగా తన తండ్రి పాలనలోని తప్పుల్ని పరోక్షంగా లోకేశ్ లోకానికి చాటి చెబుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరు సభలో లోకేశ్ ప్రసంగిస్తూ…. ‘వై నాట్ 175 అంటున్న జగన్, వై నాట్ ప్రత్యేక హోదా, వై నాట్ జాబ్ కేలెండర్, వై నాట్ సీపీఎస్ రద్దు, వై నాట్ పోలవరం, వై నాట్ విశాఖ రైల్వే జోన్’ అని కూడా మాట్లాడాలని చక్కటి సూచన చేశారు. ఆణిముత్యా ల్లాంటి మాటలు మాట్లాడిన లోకేశ్ భలే ముద్దొస్తున్నాడని ప్రత్యర్థులు అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.
రాజకీయంగా వై నాట్ 175 అనే నినాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే వినిపించడాన్ని తీసుకుని లోకేశ్ ఎద్దేవ చేశారు. జగన్‌పై పొలిటికల్ సెటైర్ బాగానే వుంది. అయితే తన సెటైర్‌లో తన తండ్రి పాలనలోని డొల్లతనాన్ని బయటపెట్టిన విషయాన్ని లోకేశ్ గమనించలేదనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ రాజకీయ, పరిపాలనానుభవం కలిగిన చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందనే ఆలోచనే, టీడీపీకి అధికారం తెచ్చి పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలు … ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విశాఖ రైల్వేజోన్, యువతకు ఉద్యోగాలు. ఇక సీపీఎస్ రద్దు విషయానికి వస్తే… అది వైసీపీ ఎన్నికల హామీ. దీనికి పూర్తిగా జగన్ బాధ్యత వహించాల్సి వుంటుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంతో పాటు, ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో కలిసి అధికారం పంచుకుని, ఏపీకి సాధించిందేమిటి? అనే ప్రశ్నకు లోకేశ్ సమాధానం చెప్పాల్సి వుంది.
ప్రత్యేక ప్యాకేజీకి ఆశ పడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే. అసలు ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుందని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాన్ని నాటి సీఎం చంద్రబాబు నిలదీయలేదా? అలాగే కేంద్ర ప్రభుత్వం కట్టించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ బాధ్యతల్ని, కాంట్రాక్టు పనులకు కక్కుర్తిపడి చంద్రబాబు సర్కార్ తీసుకోవడం వాస్తవం కాదా? విశాఖ రైల్వేజోన్ విషయమై ఎందుకని నాటి టీడీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదో లోకేశ్ సమాధానం చెప్పాలి?
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర హక్కుల్ని సాధించుకోవడంలో గత టీడీపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టుగా వ్యవహరిస్తోంది. తన ప్రభుత్వం విఫలమైన అంశాలను పాదయాత్రలో ప్రస్తావించడం ద్వారా లోకేశ్ విమర్శలపాలవుతున్నారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన హక్కుల్ని సాధించుకోవడంలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు దొందు దొందే అని చెప్పేందుకు లోకేశ్ తాజా విమర్శలే నిదర్శనం.