యువగళం రాంగ్ ట్రాక్‌లో పోతోంది. పాదయాత్రలో నారా లోకేశ్ మాట తీరే ఆయనకు శత్రువుగా పరిణమిస్తోంది. పాదయాత్రలో ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా సాగుతోందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. లోకేశ్ తన అసహనాన్ని, పైత్యాన్ని ప్రజలపై ప్రదర్శించడానికి పాదయాత్రను ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అయ్యిందన్న వాదన బలపడుతోంది.
టీడీపీకి మళ్లీ అధికారం ఇస్తే, ఏం చేస్తారో చెప్పాల్సింది పోయి, జగన్‌ను అది చేస్తాం, ఇది చేస్తామని హెచ్చరించడానికి సరిపోతోంది. జగన్‌కు వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే అయితే… పాదయాత్ర ఎందుకు? అనే ప్రశ్న తలెత్తుతోంది. పాదయాత్రలో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదనే విచక్షణ పూర్తిగా కొరవడింది. మరీ ముఖ్యంగా పాదయాత్రకు సంబంధించి నిర్మాణాత్మక ప్లానింగ్ కొరవడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
సహజంగా టీడీపీ కార్యక్రమాలంటే… పక్కా ప్రణాళిక వుంటుంది. అదేంటో గానీ, లోకేశ్ పాదయాత్రలో అది మచ్చుకైనా కనిపించడం లేదు. లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టికి 13వ రోజుకు చేరింది. 12వ రోజు పాదయాత్రలో లోకేశ్ ప్రసంగాన్ని గమనిస్తే… జగన్‌ను హెచ్చరించడానికే సరిపోయింది.
చిత్తూరు బహిరంగ సభలో లోకేశ్ ఏమన్నారంటే…. ‘జగన్‌రెడ్డికి అసలైన భయాన్ని పరిచయం చేసే బాధ్యత నాది. 2024 తర్వాత ఇంట్లో నుంచి బయటికి అడుగు ఎలా పెడతాడో చూస్తా’ అని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. రాజకీయ ప్రత్యర్థులు కావడంతో ఇలాంటి మాటలు టీడీపీ కార్యకర్తలకు నచ్చవచ్చేమో. కానీ సామాన్య ప్రజానీకానికి ఏం అవసరం?
జగన్‌ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా చేసేందుకు అధికారం అడుగుతున్నారా? అంటే మీ వ్యక్తిగత కక్షలు, ప్రతీకారాలు తీర్చుకోడానికి అధికారాన్ని అడుక్కుంటున్నారా? ఇదేనా యువగళం ఆశయం, ఆకాంక్ష? విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, కార్మికులు తదితరులకు ఫలానా మంచి పని చేస్తామనే భరోసా ఇవ్వడం వల్ల రాజకీయ ప్రయోజనం వుంటుందని లోకేశ్ ఎందుకు ఆలోచించ లేకపోతున్నారు? ఎంతసేపూ రాజకీయ కక్షలు, కార్పణ్యాలు తప్ప, అధికారం అంటే మరేదీ కాదా? ఇలాగైతే పాదయాత్రకు జనం ఎందుకొస్తారు?
తన పాదయాత్ర విఫలమైందనే టాక్ ఎందుకొచ్చిందో లోకేశ్ ఆలోచించాలి. లేదంటే టీడీపీకి భారీ నష్టమని హెచ్చరించక తప్పదు.