ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విపక్షాల ట్రాప్ లో పడుతున్నారా? వాస్తవంగా లేని రాజకీయ వేడిని రాజేసినట్టుగా విపక్షాలు భ్రమింపజేస్తోంటే.. జగన్ కూడా వారి ట్రాప్ లో పడి, దానికి తగినట్లుగా స్పందిస్తున్నారా? అంటే.. అవుననే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కార్యక్రమం.. ఇలాంటి అనుమానం కలిగిస్తోంది. ‘జగనన్నే మన భవిష్యత్తు’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ తాజాగా నిర్ణయించింది. అయితే ఈ విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ విపక్షాల ట్రాప్ లో పడుతున్నారా? అని అనుకుంటున్నారు.
‘జగనన్నే మన భవిష్యత్తు’ అనే నినాదమే టైటిల్ గా పార్టీ తాజా కార్యక్రమం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి వివరించడం ఈ కార్యక్రమ స్వరూపంగా నిర్దేశించారు. జగన్ సర్కారులో ప్రతి ఇంటికీ ఎంతెంత విలువైన సంక్షేమ పథకాలు అందాయో వివరిస్తూ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. పార్టీ పథకాలను, చేస్తున్న మంచిపనులను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంధానకర్తలుగా పనిచేయడానికి గృహసారథులు, కన్వీనర్ల వ్యవస్థద్వారా ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది.
అయితే ఈ నిర్ణయం ద్వారా.. పార్టీ ఎన్నికల ప్రచారానికి తొందరపడుతున్నదా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. రాష్ట్రంలో జగన్ సర్కారు మాట ఇచ్చిన దానికంటె మిన్నగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి చీకూచింతాలేని వాతావరణమే సర్వత్రా కనిపిస్తోంది.
అయితే ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్నట్టుగా.. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్టుగా విపక్షాలు చాలా కాలంనుంచి ప్రచారంచేస్తున్నాయి. ముందస్తు అవసరం మాకేం ఉంది అని ప్రభుత్వంలోని పెద్దలు పదేపదే చెప్పినా కూడా వారు, తమ తమ పార్టీలను కాపాడుకోవడం కోసం అదే పాట పాడుతూ బతుకుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి రాజకీయ వాతావరణం వేడెక్కకపోయినప్పటికీ.. లోకేష్ పాదయాత్ర ప్రారంభం కావడం, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తానని చెబుతుండడం ద్వారా.. ఎన్నికల వేడి ముంచుకొచ్చేసిందనే భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ ట్రాప్ లో జగన్ పడినట్టుగా కనిపిస్తోంది. గృహసారథులు, వార్డు కన్వీనర్ల ద్వారా.. ప్రభుత్వ పథకాలు, ఇంటింటికీ జరిగిన లబ్ధి గురించి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్లడం అంటే ఆల్మోస్ట్ ఎన్నికల ప్రచారమే. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలతో జగన్ ఇదే పనిచేయించారు. ఇంకా ఆ కార్యక్రమం అమలవుతూనే ఉంది. ఈలోగా మళ్లీ గృహసారథులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఆ కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలన్నిటినీ మళ్లీ వివరించడానికి పూనుకుంటే ఈ ప్రచారం ఓవర్ డోసేజీ అవకుండా ఉంటుందా? అనేది పలువురి అభిప్రాయం.
విపక్షాల ట్రాప్ లో పడి జగన్, తన చర్యల ద్వారా రాష్ట్రంలో లేని ఎన్నికల వాతావరణం ఉన్నట్టుగా కనపడడానికి కారణమవుతున్నారని పలువురు భావిస్తున్నారు. మరి జగన్ జాగ్రత్తపడతారా, అప్పుడే ఎన్నికల ప్రచారానికి దిగేస్థాయిలో ఆతురతకు గురికాకుండా నిమ్మళంగా ఉంటారా? అనేది వేచిచూడాలి.