హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి స్థాయికి వెళ్లే వ్యక్తులు మానవతీత శక్తులు అయి ఉండాలనే నిబంధనేమీలేదు. అప్పటిదాకా వారు గడిపివచ్చిన జీవితంలో సాధారణ మానవ భావోద్వేగాలకు, స్పందనలకు, రాగద్వేషాలకు అతీతంగా రుషుల్లాగా వ్యవహరించి ఉండాలని ఆశించడానికి అవకాశం కూడా లేదు. సమాజం కోరుకోగలినదెల్లా.. ఒకరు అంత ఉన్నతమైన న్యాయమూర్తి పదవిని అధిష్ఠించిన తర్వాత.. ఆ పదవులకు వన్నె తెచ్చేలాగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని, నిజాయితీగా పనిచేయాలని మాత్రమే. కానీ.. న్యాయవ్యవస్థ పట్ల ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేసేలా ఇప్పుడు కొత్త వివాదం ఒకటి కుదిపేస్తోంది.
తమిళనాడులో మద్రాసు హైకోర్టుకు న్యాయమూర్తిగా లక్షణ చంద్ర విక్టోరియా గౌరి తాజాగా నియమితులు అయ్యారు. ఆమె నియామకానికి అసంబద్ధమైన ఒక వివాదాన్ని ముడిపెట్టి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవులను అధిష్ఠించడంలో పాత అనుభవాలను గుర్తు చేసుకోకుండా.. ఎల్సీవీ గౌరి విషయంలో మాత్రమే వివాదం చేస్తుండడం చర్చనీయాంశం అవుతోంది.
లక్షణచంద్ర విక్టోరియా గౌరి.. తమిళనాడులో సీనియర్ ఎడ్వొకేట్ గా పనిచేశారు. మద్రాసు హైకోర్టు కొలీజియం ఆమె పేరును అదనపు జడ్జిగా ప్రతిపాదిస్తూ సుప్రీం కోర్టుకు పంపడం వారు ఆమోదముద్ర వేయడం జరిగిపోయాయి. అయితే ఆమెకు భారతీయ జనతా పార్టీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ముస్లిం- క్రైస్తవులను ద్వేషిస్తూ గతంలో ఆమె ప్రసంగాలు కూడా చేశారని కొందరు వివాదాన్ని లేవనెత్తారు. సుప్రీంలో కేసు కూడా వేశారు. అయితే ఆ నియామకానికేమీ బ్రేకులు పడలేదు. ఆమె యథావిధిగా మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా ప్రమాణం కూడా చేశారు.
అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలందించిన ఎన్వీ రమణ వంటి వారి చుట్టూ రేగిన వివాదాలు ఉదాహరణగా ఉండగా, ఎల్సీవీ గౌరి విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారనేది అర్థం కాని సంగతి. ఎన్వీ రమణ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వ్యక్తి అని, ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఆపాలని.. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి అప్పట్లో లేఖ రాశారు. లేఖ రాసిన విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఒప్పుకున్నారు.
ఎన్వీ రమణ పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఓ బస్సు ధ్వంసం కేసులో ఆయనపై కేసుకూడా అప్పట్లో నమోదు కాగా, తర్వాత దానిని కొట్టివేసినట్టు ప్రచారం ఉంది. అయితే సీఎం జగన్ ఉత్తరం సహా, వివాదాలేవీ ఆయనను అడ్డుకోలేకపోయాయి. ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి పదవీకాలం సేవలందించి పదవీవిరమణ చేశారు.
సాధారణంగా జడ్జిలకు పూర్వాశ్రమంలో ఉండే అనుబంధాలు న్యాయమూర్తి అయ్యాక ప్రత్యేకించి ఫలానా కేసును ప్రభావితం చేస్తాయని అనిపించినప్పుడు.. ‘నాట్ బిఫోర్ మీ’ అనే పద్ధతి ద్వారా వారే ఆ కేసునుంచి తప్పుకుంటారు. వారు తప్పుకోవాలని ప్రతివాది కూడా కోరవచ్చు. అలా న్యాయవ్యవస్థలో నిష్పాక్షికతకు పెద్దపీట వేస్తారు. కానీ, అసలు వారికి గతంలో రాజకీయ పార్టీల పరిచయమే ఉండకూడదని అన్నట్లుగా.. ఎల్సీవీ గౌరి విషయంలో జరుగుతున్న రాద్ధాంతం చిత్రంగా, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదిలాగా కనిపిస్తోంది.