కేంద్రంతో పోరాటంలో వైసీపీ డోస్ పెంచుతోందా?

కార్యసాధనలో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాలనేది రాజనీతి. అనునయంగా చెప్పి సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తొలి ప్రయత్నం జరగాలి. చివరి ప్రయత్నం మాత్రమే తగాదా పెట్టుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్…

కార్యసాధనలో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాలనేది రాజనీతి. అనునయంగా చెప్పి సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తొలి ప్రయత్నం జరగాలి. చివరి ప్రయత్నం మాత్రమే తగాదా పెట్టుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు కూడా అదే రాజనీతిని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే కుటిల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తాము అనుకున్న తీరులోనే కార్యసాధనకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రంతో పోరుబాటకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క స్వప్నం.. ప్రత్యేకహోదా! ఈ హోదాను సాధిస్తే ఏపీ అన్ని రకాలుగానూ ఎంతో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. తాజాగా పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేకహోదా డిమాండ్ ను వినిపిస్తూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

హోదా రాకపోవడం అనేది కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీల ఉమ్మడి వైఫల్యం అని ఆయన ఘాటుగా విమర్శించారు. అలా తీవ్రమైన అన్యాయం చేసినందుకే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 1 శాతం ఓట్లతో తుడిచిపెట్టుకుపోయిందని, బిజెపికి 0.5శాతం ఓట్లు వచ్చాయని, ఆ తీర్పుతో ఏపీ ప్రజలు ఈ రెండు పార్టీలకు అలా బుద్ధి చెప్పారని అన్నారు. ప్రస్తుతం బిజెపి హోదా అనేది చరిత్ర అంటోందని, కానీ తాము ప్రత్యేక హోదా డిమాండ్ ను చరిత్రలో కలిసిపోనివ్వమని, సాధించి తీరుతాం అని విజయసాయిరెడ్డి అన్నారు. 

సామదాన భేద దండోపాయాల అచ్చమైన రాజనీతిని వైసీపీ ప్రత్యేకహోదా విషయంలో అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ మోదీ, అమిత్ షాలను కలిసిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకహోదా విన్నపాలను వినిపిస్తూనే వచ్చారు.

సామరస్యంగా ఎంత ప్రయత్నం చేసినా అటునుంచి స్పందన లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి హోదా గురించి సాక్షాత్తూ పార్లమెంటు వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ.. బిజెపికి 0.5 శాతం ఓట్లతో ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేస్తూ.. హోదా విషయంలో తమ సీరియస్ నెస్ ను తెలియజెప్పారు. భేదోపాయం అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేంద్రంతో సామరస్యంగా ఉండడం తమ విధానం అయినప్పటికీ.. రాష్ట్రప్రయోజనాలే ముఖ్యమని, అందుకోసం విభేదించాల్సి వస్తే తగ్గేది లేదని జగన్ సర్కారు ఈ వ్యాఖ్యలతో నిరూపించినట్లయింది. 

చూడబోతే ప్రత్యేకహోదా కోసం వైసీపీ తమ స్వరాన్ని మరింత ఘాటుగా వినిపించబోతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యక్ష ఆందోళనలకు కూడా పార్టీ పూనుకుంటుందా? అనే అభిప్రాయమూ కలుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో.. ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీలందరితోనూ రాజీనామాలు చేయించడం ద్వారా.. జగన్ తమ విధానాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పారు. ఈసారి కూడా ఇన్నాళ్లూ ఎదురుచూసిన తర్వాత.. ఇప్పుడు డోసు పెంచుతున్నట్లుంది. ప్రత్యేకహోదా కోసం అవసరమైతే కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అన్నంత స్థాయిలో విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.