అలాగైతే, పవన్ కు ‘కల్యాణరత్న’ బిరుదివ్వాలా?

ఎదుటివారి మీద నిందలు వేయడానికి చూపుడు వేలెత్తి ఒకవేలిని వాళ్లవైపు చూపిస్తే.. తతిమ్మా నాలుగువేళ్లూ మనవైపే చూపిస్తుంటాయనేది లోకనీతి. మరి ఈ సత్యం మేధావి అయిన పవన్ కల్యాణ్ కు తెలుసో లేదో? ఆయన…

ఎదుటివారి మీద నిందలు వేయడానికి చూపుడు వేలెత్తి ఒకవేలిని వాళ్లవైపు చూపిస్తే.. తతిమ్మా నాలుగువేళ్లూ మనవైపే చూపిస్తుంటాయనేది లోకనీతి. మరి ఈ సత్యం మేధావి అయిన పవన్ కల్యాణ్ కు తెలుసో లేదో? ఆయన మాత్రం ఎడాపెడా జగన్మోహన్ రెడ్డి మీద, ఏపీ సర్కారు మీద తనకు తోచిన రీతిలో విమర్శలు చేసేస్తుంటారు. ఆ విమర్శల్లో నిందల్లో ఔచిత్యం ఉందా లేదా పట్టించుకోరు. తన విమర్శలను తననే నవ్వులపాలు చేస్తాయా? లేదా, నిజంగానే ప్రజలను ఆలోచింపజేస్తాయా? అనే సంగతి కూడా పట్టించుకోరు.

తాను చల్లదలచుకున్న బురద చల్లుకుంటూ వెళ్లిపోవాలనేది మాత్రమే ఆయన కోరిక. అలాంటి చెత్త ప్రయత్నాల్లో భాగంగా.. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పులపై బురద చల్లడానికి పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నం బ్యాక్ ఫైర్ అయింది. ఆయన అప్పుల గురించి విమర్శ చేస్తే.. వైసీపీ అభిమానులు,ప్రజలు పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మళ్లీ మాటెత్తుతున్నారు.

జగన్ మీద నిందలు వేయడానికి ప్రత్యేకంగా కొన్ని కార్టూన్లు గీయించి వాటిని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయడం ద్వారా.. ఒక ప్రయత్నం చేస్తున్న పవన్ కల్యాణ్ తాజాగా ప్రభుత్వ అప్పుల గురించి ప్రస్తావించారు.

9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 55,555 వేల కోట్ల రూపాయల అప్పు చేసి రికార్డు సృష్టించిందని అంటూ.. దానికి సంబంధించి.. ముఖ్యమంత్రి జగన్ కు కొందరు అధికారులు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఈ కార్టూన్ ఉంటుంది.

‘‘భారతరత్నలాగా ఇది కూడా ప్రతిష్ఠాత్మకమైన అవార్డట సార్’’ అంటూ జగన్ కోటరీలోని అధికారులు ఆయనకు దాని గురించి వివరిస్తుంటారు. ఇదీ కార్టూన్. అయితే దీనికి కౌంటర్ గా- అలా అయితే పవన్ కల్యాణ్ కు  ‘కల్యాణరత్న’ అవార్డు ఇవ్వాలా? అంటూ వైసీపీ అభిమానులు రెచ్చిపోతున్నారు.

పవన్ కల్యాణ్ పెళ్లిళ్లమీద పెళ్లిళ్లు చేసుకుంటూ చెలరేగిపోయే కల్యాణ నీతి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ కు ఈ కౌంటర్ చాలా మామూలే. అయితే.. నేను పాయింట్ మాట్లాడితే మీరు పర్సనల్ విషయాలు మాట్లాడతారేంటి.. అని ఆయన సెలవిస్తుంటారు. తన పెళ్లిళ్లను ఆయన సమర్థించుకుంటూ ఉంటారు. 

‘‘నేను ఒక భార్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నానే తప్ప, తప్పు చేయలేదు’’ అని కల్యాణ రత్న పవన్ కల్యాణ్ తన కల్యాణాలను సమర్థించుకుంటూ ఉంటారు. అంటే.. చట్టం పరిధిలో ఉన్నంత వరకు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పు కాదు అనేది ఆయన ఒపీనియన్ అన్నమాట. మరి జగన్ సర్కారు కూడా అప్పు చేస్తున్నదే తప్ప, దొంగతనాలకు దోపిడీలకు పాల్పడడం లేదు కదా.

అసలు దేశంలో అప్పులు చేయకుండా నడుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా? అనేది ప్రశ్న. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు హద్దు మీరిపోయినట్లుగా, ఈ అప్పులు కూడా హద్దు మీరిపోయినప్పటికీ.. అప్పు అనేది చట్టం పరిధిలోనే ఉన్నప్ప్పుడు.. తప్పెలా అవుతుందనేది వారి ప్రశ్న.

పవన్ కల్యాణ్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. అప్పుల గురించి కాదు, తప్పుల గురించి మాట్లాడాలి. సంక్షేమ పథకాల్లో తప్పుడు పథకాలుంటే వాటిని వ్యతిరేకించాలి. అలా చేయకుండా ఇలాంటి పాచి విమర్శల వల్ల ఉపయోగం లేదని ప్రజలు భావిస్తున్నారు.