వాళ్లిద్ద‌రి సంసారం ఎన్నాళ్ల ముచ్చ‌టో?

టీడీపీ, జ‌న‌సేన రాజ‌కీయ సంసారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలో మాదిరిగానే రాజ‌కీయ పంథాలోనూ స్థిర‌త్వం లేద‌నే విమ‌ర్శ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా రెండు మూడు నిమిషాలు…

టీడీపీ, జ‌న‌సేన రాజ‌కీయ సంసారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలో మాదిరిగానే రాజ‌కీయ పంథాలోనూ స్థిర‌త్వం లేద‌నే విమ‌ర్శ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా రెండు మూడు నిమిషాలు క‌ద‌ల‌కుండా మాట్లాడితే ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకోవాల‌ని త‌మ పార్టీ నాయ‌కుడు రామ‌కృష్ణ‌కు స‌ల‌హా ఇచ్చిన‌ట్టు సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ అన‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో టీడీపీతో పొత్తు ప్ర‌క‌టించి, రానున్న ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన‌డంపై సెటైర్స్ పేలుతున్నాయి. బీజేపీని పెళ్లాడి, విడాకులు తీసుకోకుండానే టీడీపీతో స‌హ‌జీవ‌నం చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం చూస్తే, రేణుదేశాయ్ ఆవేద‌న గుర్తుకొస్తోంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. త‌నతో కాపురం చేస్తూనే, మ‌రొక‌రితో పిల్ల‌ల్ని కంటే త‌న ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల‌ని రేణుదేశాయ్ వాపోవ‌డం అంద‌రికీ తెలిసిందే.

ఇప్పుడామె మాట‌ల్ని సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు. టీడీపీతో సంసారం ఎన్నాళ్లో చూడాలంటూ నెటిజ‌న్లు వెట‌క‌రిస్తున్నారు. రాజ‌కీయ జీవితంలో ఒక్కో ద‌ఫా కొన్ని పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎలాంటి సిద్ధాంతం లేద‌నేందుకు నిద‌ర్శ‌నమ‌ని విమ‌ర్శిస్తున్నారు.

2014లో ప్ర‌శ్నించ‌డానికే పార్టీ అంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికి, ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ-బీజేపీ కూట‌మి ప‌ల్లకీ మోశారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చేందుకు వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో క‌లిసి 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీతో పాటు తాను ఘోర ప‌రాజ‌యాన్ని పొంద‌డంతో బీజేపీపై వ్యామోహం పెంచుకున్నారు. నాలుగేళ్లు పూర్త‌య్యే స‌రికి బీజేపీపై వ్యామోహం పోయింది.

మ‌ళ్లీ చంద్ర‌బాబుతో అంట‌కాగ‌డం మొద‌లు పెట్టారు. బీజేపీతో అధికారికంగా విడిపోకుండానే మ‌ళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా త‌న‌కు ఒక సిద్ధాంతం అంటూ లేద‌ని ప‌వ‌న్ నిరూపించారు. వైసీపీ విమ‌ర్శిస్తున్న‌ట్టుగా మూడేళ్ల‌కో సారి జీవిత భాగ‌స్వాముల్ని మార్చిన‌ట్టు… రాజ‌కీయంలోనూ అదే తీరుతో ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి టీడీపీ, జ‌న‌సేన రాజ‌కీయ సంసారం ఎన్నాళ్ల ముచ్చ‌టో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.