డ్రామా క్వీన్ రాఖీ సావంత్ మరో హంగామా మొదలుపెట్టింది. అయితే ఈసారి తనది డ్రామా కాదంటోంది, పబ్లిసిటీ పిచ్చి అంతకంటే కాదంటోంది. 'ప్లీజ్ నన్ను నమ్మండి.. నా భర్తను అరెస్ట్ చేయించాను' అని రిక్వెస్ట్ చేస్తోంది. నిజమే, రాఖీసావంత్ భర్త ఆదిల్ దురానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈమధ్యే తన తల్లిని కోల్పోయింది రాఖీ సావంత్. కాన్సర్ తో పోరాడుతూ ఆమె మరణించింది. అయితే తన తల్లి ఇంత తొందరగా మరణించడానికి తన భర్త ఆదిల్ కారణమని తీవ్ర ఆరోపణలు చేసింది రాఖీ సావంత్. ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే ఆదిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
భర్తను అరెస్ట్ చేసిన విషయాన్ని రాఖీసావంత్ నిర్థారించింది. తన భర్తపై తను పోలీసులకు ఫిర్యాదుచేశానని, గృహ హింస కింద అతడ్ని అరెస్ట్ చేశారని ఆమె వాయిస్ నోట్ రిలీజ్ చేసింది.
“ఆదిల్ ఖాన్ దురానీ ఇప్పుడే నా ఇంటికొచ్చాడు. అతడిపై నేను ఇప్పటికే పోలీస్ కంప్లయింట్ ఇచ్చాను. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఇది నాటకం కాదు. నా జీవితం నాశనమైంది. ఆదిల్ నన్ను చావగొట్టాడు, నా డబ్బులు లాక్కున్నాడు. నన్ను ఎందుకు కొడుతున్నావని ఆదిల్ ను అడిగేదాన్ని. మీడియా ముందుకెళ్తానని అన్నాను. నేను మీడియా ముందుకొచ్చినా ఎవ్వరూ నమ్మరని ఆదిల్ నాతో అన్నాడు. మరింత గట్టిగా కొట్టాడు. అతడికి వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యం ఉంది.”
ఈ మొత్తం ప్రహసనంలో గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. తామిద్దరం భార్యాభర్తలమనే విషయాన్ని గత నెలలోనే వీళ్లిద్దరూ ప్రకటించుకున్నారు. ముందు రాఖీ సావంత్ నిర్థారించింది. బెట్టుచేసిన కొన్ని రోజులకు ఆదిల్ కూడా ఒప్పుకున్నాడు. అలా ఏడాదిగా కలిసే ఉంటున్నామని చెప్పుకున్న రాఖీసావంత్, ఈరోజు తన భర్తపై కేసు వేసి, అతడ్ని అరెస్ట్ చేయించింది.