విశాఖ క్యాపిటల్ సిటీ అని వైసీపీ అంటోంది. ఆ కెపాసిటీ విశాఖ వంటి మెగాసిటీకే ఉందని నాలుగేళ్లుగా చెబుతోంది. విశాఖ రాజధాని కోసం మూడు రాజధానుల చట్టాన్ని కూడా చేశారు. అయితే కొన్ని సాంకేతిక అంశాల మూలంగా ఆ చట్టాన్ని రద్దు చేసుకున్నా మరో చట్టం తొందరలో రూపొందిస్తామని నాడే సీఎం జగన్ సభకు చెప్పారు.
ఇపుడు అమరావతి రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఆ కేసులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వైసీపీ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఈ లోగా తాము చేయాల్సిన పనులు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ భీమిలీ బీచ్ రోడ్డులో రాబోంది. సీఎం నివాసం కూడా అటే ఉండబోతోంది.
దానికి సంబంధించిన ఏర్పాట్లను అపుడే అధికారులు మొదలెట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్ వచ్చే దారిని కూడా గుర్తించి దానికి రంగులు హంగులు అద్దుతున్నారు. మంత్రుల క్వార్టర్స్ కూడా భీమిలీ బీచ్ రోడ్ లైన్ లో వస్తాయని తెలుస్తోంది. విశాఖలో గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు ఇదే పని మీద కసరత్తు చేస్తున్నారు.
విశాఖకు రాజధాని కళ తెచ్చేలా మొదట సీఎం జగన్ విశాఖలో అడుగుపెట్టనున్నారు. ఇంతలో మరో విశేషం అన్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా విశాఖలో ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్ళు అవుతున్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లోనే ఉంది. దాన్ని ఏపీకి తరలించలేదు.
ఇపుడు ఆర్బీఐ విశాఖనే ఎంచుకుని అక్కడ రీజనల్ ఆఫీస్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఒక విధంగా విశాఖ రాజధానికి కొత్త అందాన్ని అర్ధాన్ని చెబుతున్నట్లుగా భావించాలని అంటున్నారు. విశాఖకు ఆర్బీఐ ఆఫీస్ వస్తే అయిదు వందల మంది సిబ్బంది పనిచేస్తారు. సుమారుగా ముప్పయి వేల చదరపు అడుగుల స్థలం అవసరం. దీని మీద జిల్లా కలెక్టర్ తో కూడా ఆర్బీఐ అధికారులు చర్చలు జరిపారు.
విశాఖలోని రుషికొండ కానీ మధురవాడలో కానీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాని ఏర్పాటు చేయడానికి భవనాలను ఇచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు వచ్చింది. తొందరలోనే విశాఖకు ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ తరలిరానుంది. అంటే ఇక మీదట హైదారాబాద్ తరువాత విశాఖలో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ఉంటుంది అన్న మాట. అలా ఈ రెండు నగరాలూ సరిసాటిగా రాజధాని శోభను సంతరించుకుంటాయని అంటున్నారు.