తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి ఈ నెల ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం అమలు జరిగితే రాయలసీమ నీటి అవసరాలకు ఎదురయ్యే సమస్యపై చర్చ సాగుతోంది. మొత్తం ఈ వ్యవహారంలో అధికార వైసీపీ ప్రభుత్వ ఆలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఈ ప్రాజెక్టుతో సీమ ఎడారి అన్నట్లు భావోద్వేగాలతో కూడిన వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం సీమ సస్యశ్యామలంగా ఉన్నదా? రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆందోళన కన్నా పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులపై ఎక్కువ చర్చే రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం.
KRMB, ఏపీ -తెలంగాణ ప్రభుత్వాల అసంబద్ధ వైఖరే…
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహిణ పద్ధతే అసంబద్ధం. శ్రీశైలంలో 830 అడుగులు దాటితేనే నీటిని సరఫరా చేయాలి. అందుకు భిన్నంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే బోర్డులు ఏం చేస్తున్నాయి? 854 అడుగులకు పైనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఉన్నా అందుకు భిన్నంగా ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని సాగర్ కు, కొన్ని సమయాలలో సముద్రంలోకి విడుదల చేస్తున్నా బోర్డులకు పట్టడం లేదు. ఫిర్యాదు చేస్తే నోటీసులు జారీ చేయడం, రెండు ప్రభుత్వాలు రాజీపడి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే పట్టించుకోకుండా ఉండటం వల్ల రాయలసీమ నీటి అవసరాలకు ప్రధాన సమస్యగా మారింది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం..
తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయడం వల్ల రాయలసీమ ప్రయోజనాలు దెబ్బ తింటుందన్న ఆందోళన కలుగుతోంది. కారణం కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు సరఫరా జరిగేది పోతిరెడ్డిపాడు ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని సరఫరా చేయాలంటే… శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉండాలి.
అలాంటిది రోజుకు 3 TMC సామర్ధ్యంతో 800 అడుగుల నుంచే నీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 200 TMC సామర్ధ్యం ఉన్న శ్రీశైలం నుంచి రోజుకు 3 TMC ల నీటి సరఫరా తెలంగాణ చేస్తే స్వల్ప కాలంలోనే 854 అడుగుల కిందకు నీరు వెళుతుంది. దీంతో పోతిరెడ్డిపాడుకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు SRBC తో సహా గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయలేం. ముచ్చిమర్రి ఉన్నా దాని సామర్ధ్యం రోజుకు కేవలం అర TMC మాత్రమే.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం
తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచి రోజుకు 3 TMC ల నీటిని లిఫ్ట్ చేసుకునే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో కూడా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పకతప్పదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తే బోర్డుకు పిర్యాదు చేయదు. కొన్ని సందర్భాలలో తాను కూడా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. శ్రీశైలంలో నీటిని నిల్వ ఉంచడం రాయలసీమ ప్రాజెక్టులకు కీలకం అని తెలిసినా తెలంగాణ ప్రభుత్వం చేసే తప్పుల పై ఫిర్యాదు చేయకపోగా తానూ అదే తప్పు చేయడం అలసత్వం కాకుండా మరేంటి ?
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏమైంది?
వరద రోజులు తగ్గినా వరద ప్రవాహం బాగుంది కనుక సత్వరం నీటిని సరఫరా చేసేందుకు వీలుగా 800 అడుగుల నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. నాడు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎంత గొడవ చేసింది. మరి నేడు ఏ అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తే ఏపీ ప్రభుత్వం ఎందుకు ప్రతిఘటించలేదు? కనీసం మా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అంగీకరిస్తే తప్ప మీ ప్రయత్నాలను ఒప్పుకోమన్న షరతు కూడా పెట్టలేదు. పాలమూరుకు లేని అభ్యంతరాలు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎందుకు వచ్చాయి? అనుమతుల సమస్యా? నిధులు సమస్యా? అన్న అనుమానం ఏపీ ప్రభుత్వం మీద వస్తోంది.
అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? వందల TMC ల నీటి ప్రవాహం ఉండి 103 TMC ల హక్కు కలిగిన తుంగభద్ర పై గుండ్రేవుల నిర్మాణం ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వం కృష్ణపై జాతీయ రహదారిలో భాగంగా తీగల వంతెన నిర్మాణ ప్రతిపాదనలో తీగల వంతెన కాదు సిద్దేశ్వరం అలుగు చేపట్టాలి. కుందూ పై జోలదరాసి, రాజోలు, ఆదినిమ్మాయనపల్లి బ్యారేజీ కధ ఏంటి? అన్న డిమాండు సీమ ఉద్యమ సంస్థల వాదనగానే మిగిలింది.
నేడు పాలమూరు అమలు కాలేదు, ఎగువభద్ర జరగలేదు. రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కాలేదు. లోపం ఎక్కడ ఉందంటే పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై పోరాటం తప్ప రాయలసీమలో నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆందోళన లేకపోవడమే.
ఇకనైనా ఏపీ ప్రభుత్వం రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో అలసత్వం విడనాడాలి. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలను వ్యతిరేకించాలి. సాధ్యపడకపోతే. తాను రాయలసీమలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తిచేయాలి. తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో నిల్వ సరఫరా చేసేందుకు దృష్టి సారించాలి. రాయలసీమ సమాజం పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పెడుతున్న శ్రద్ద కన్నా రాయలసీమలో జరగాల్సిన ఏర్పాట్లు పై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం