అపోజిట్ సెక్స్ తో అట్రాక్ట్ కావడం లో కావొచ్చు, కాలేజీలోనో, ఆఫీస్ లోనో స్నేహితులను ఏర్పరుచుకోవడంలో కావొచ్చు.. రెండు రకాల స్వభావాలుంటాయి. అందు ఒక స్వభావం ఎవరితో అయినా ఇట్టే కలిసిపోవడం, వారితో సన్నిహితంగా మెలగడానికి రెడీగా ఉండటం అపోజిట్ సెక్స్ అయితే… వారికి ఆకర్షితులుగా మారిపోయి ప్రేమలో కూడా పడిపోవడం! ఇక ప్రేమ, స్నేహం వంటి విషయాల్లో రెండో కేటగిరి చాలా సెలెక్టివ్ గా ఉండటం. వీరు అందరితోనే ఇట్టే కలిసిపోలేరు. అందరితోనే స్నేహం అనే మాటను కానీ, ప్రేమ అనే మంత్రాన్ని కానీ తేలికగా ప్రయోగించలేరు. సెలెక్టివ్ గా ఉంటారు.
ఒకరితో స్నేహం అంటూ వేగంగా దూసుకపోవడం కానీ, వారితో రాసుకుపూసుకు తిరగడం కానీ వీరు చేయలేరు. వీరికి ఉన్న సర్కిల్ చిన్నది. రిజర్వ్డ్ గా ఉంటారు. ఇవన్నీ నెగిటివ్ పాయింట్లే అంటారు సహజంగా. అయితే.. మానసిక ప్రశాంతత విషయంలో కానీ, ఇతరులతో ఇబ్బందుల్లేకుండా ఇష్యూస్ లేకుండా ఉండటంలో కానీ ఈ కేటగిరిలో ఉండే వారే చాలా కూల్ !
వీరు తమ స్నేహితులను ఎంచుకోవడంలో సెలెక్టివ్ గా ఉంటారు. హాయ్ చెప్పిన ప్రతి వారికీ వీరు సన్నిహితులు అయిపోలేరు. అవతలి వ్యక్తి స్వభావాన్ని కొంత గమనించే వీరు వారితో కలుస్తారు. ఒకటీ రెండు మీటింగుల తర్వాతే సదరు వ్యక్తితో తాము కొనసాగగలమా లేదా.. అనే క్లారిటీకి వస్తారు. సెట్ అవుతారనుకుంటేనే వారితో ఆ తర్వాత స్నేహం స్థాయి పెరుగుతుంది. లేదంటే అక్కడితో ఆగిపోతుంది. కాలేజ్, ఆఫీస్.. ఇలాంటి చోట ఏర్పడే స్నేహాల విషయంలో ఇలా సెలెక్టివ్ గా సాగుతుంది వీరి వ్యవహారం.
మరి ఈ తీరు వల్ల సదరు వ్యక్తులపై రిజర్వ్డ్ అనే ముద్ర వేసినా, వారు అందరితోనూ కలివిడిగా ఉండలేరంటూ వేరే వాళ్లు తేలికగా కామెంట్ చేసినా, అందరితోనూ ఊరికే కలిసిపోతే ఆ తర్వాత వారిని కొంత వరకూ భరించాల్సి ఉంటుందనే విషయాన్ని వేరే చెప్పనక్కర్లేదు!
సెలెక్టివ్ గా కొంతమందితో స్నేహం అది కూడా సెట్ అయ్యే వారితో సమయం గడిపే పరిస్థితి ఉన్నప్పుడు కొత్త తలనొప్పులు వస్తాయనే టెన్షన్ ఉండదు. అందరితోనూ తెగ స్నేహం చేసే వాళ్లు ఆ అందరి కోసమే చాలా త్యాగాలు చేయాల్సి రావొచ్చు! ఒకవేళ ఒకసారి అందరితోనే స్నేహంగా మెలగడం మొదలైతే.. ఆ తర్వాత దాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఏదో ఒక దశలో తగ్గినా.. సెల్ఫ్ ప్రయారిటీస్ వేరే ఏర్పడినా.. ఆ ప్రవర్తన అందరిలోనూ మళ్లీ ప్రత్యేకంగా రిజిస్టర్ అవుతుంది.
ఇక ప్రేమ సంగతి సరేసరి! ఎంతో కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రేమ కలాపాన్ని మొదలుపెట్టడానికి, ఫిజికల్ అట్రాక్షన్ తో ప్రేమలో మునిగిపోవడానికి చాలా తేడా ఉంటుంది. ముందే అవతలి వ్యక్తి గురించి తెలుసుకుని ముందుకు సాగితే ఆ ప్రయాణం సాఫీగా ఉండవచ్చు. అయితే సెలెక్టివ్ కేటగిరి వారికి ఇక్కడో నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. వీరు తమ తీరు వల్ల .. అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది! ఈ లోపే మరొకరు ఈ విషయంలో దూసుకుపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ.. అవతలి వారితో గురి కుదిరిందంటే మాత్రం ఈ కేటగిరి వారి బంధమే ధృడంగా ఉంటుంది. సాఫీగా సాగుతుంది!