వైసీపీని కాదని, మరో మార్గాన్ని ఎంచుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత బోరుగడ్డ అనిల్‌కుమార్ పార్టీ కార్యాలయం తగులబడింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే, కారుకు కట్టేసుకుని వెళ్తానని కోటంరెడ్డిని ఫోన్‌లో బోరుగడ్డ అనిల్ హెచ్చరించడం తీవ్ర కలకలం సృష్టించింది.
గతంలో పలువురిని ఇదే రీతిలో అనిల్‌కుమార్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులోని ఆయన ఇంటికి కొందరు వెళ్లి అనిల్ గురించి కుటుంబ సభ్యుల్ని ఆరా తీసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అనిల్‌ను తీవ్రస్థాయిలో దూషించారు. ఈ క్రమంలో గుంటూరు డొంకరోడ్డులోని ఆయన కార్యాలయంపై పెట్రోల్ పోసి అర్థరాత్రి తగులబెట్టారు. ఈ ఘటనలో కార్యాలయం పూర్తిగా కాలిపోయింది.
ఈ ఘటనపై అనిల్‌కుమార్ స్పందిస్తూ… స్థానిక టీడీపీ నాయకులే దుశ్చర్యగా అభివర్ణించాడు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బోరుగడ్డ అనిల్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతూ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలని ఎత్తుగడ వేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా బోరుగడ్డ అనిల్ నోటి దురుసు తీసుకొచ్చిన తంటా అని చెబుతున్నారు.
వైసీపీతో ఏ మాత్రం సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్‌తో తనకు దగ్గరి బంధుత్వం వుందని చెప్పుకుంటూ పైరవీలు చేసుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఇతని వ్యవహారశైలి వివాదాస్పదమైంది. తాజా ఘటన వెనుక నిజానిజాలు తేల్చాల్సిన అవసరం వుంది.