ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత చందాన… లోకేశ్ పాదయాత్ర ఎల్లో బ్యాచ్ చావుకొచ్చింది. యువగళం పేరుతో ఆయన పాదయాత్ర చేపట్టి 10 రోజులు దాటింది. లోకేశ్ పాదయాత్రపై టీడీపీ, ఎల్లో మీడియా చాలా ఆశలే పెట్టుకున్నాయి. నడుస్తున్న కొద్ది ఆశలు ఆవిరవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర వైసీపీలో మోదం, టీడీపీకి ఖేదం మిగిల్చుతోంది. అనుకున్నదొకటి, అయ్యిందొకటి అనే రీతిలో పాదయాత్ర తయారైంది.
లోకేశ్ పాదయాత్ర చప్పగా సాగుతోంది. జనం నుంచి స్పందన కరువైంది. లోకేశ్ మొక్కుబడిగా నడవడం తప్పితే, ఆయన వెంట తాము వెళ్లాలనే ఉత్సాహం చివరికి టీడీపీ శ్రేణుల్లో కూడా కనిపించకపోవడం గమనార్హం. లోకేశ్ పాదయాత్రను సక్సెస్ చేయడం తమ బాధ్యతగా ఎల్లో మీడియా భుజానెత్తుకుంది. జనం నుంచి కనీసం 30-40 శాతమైనా సానుకూల స్పందన వుంటే, మిగిలిన 60-70 శాతాన్ని తాము భర్తీ చేసే అవకాశం ఉండేదని ఎల్లో మీడియా చెబుతోంది. అదేంటో తెలియదు కానీ, అసలుకే స్పందన లేకపోవడంతో …క్లోజప్ ఫొటోలు, వీడియోలతో మమ అనిపించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎల్లో మీడియా వాపోతోంది.
లోకేశ్ పాదయాత్ర వార్తలు మెయిన్ పేజీలో లోపల వేసుకోవాల్సిన పరిస్థితి. ఎల్లో మీడియా జిల్లా సంచికల్లో మాత్రమే లోకేశ్ పాదయాత్ర విజయవంతమవుతోంది. లోకేశ్ పాదయాత్రకు క్రేజ్ తీసుకురావడం ఎట్లా? అనేది ఇప్పుడు ఎల్లో మేధావులకు సవాల్‌గా మారింది. జాకీలు వేసి లేపినా… లేవని దుస్థితి. ఇక క్రేన్‌లు, అంతకు మించి యంత్రాలు తీసుకొచ్చి లోకేశ్ పాదయాత్రలో లేనిది ఉన్నట్టు చూపాల్సి వస్తోంది. లోకేశ్ పాదయాత్రపై సీనియర్లు భయపడ్డట్టే జరుగుతోంది.
“వద్దయ్యా సామి. నువ్వు జనంలోకి పోతే, టీడీపీకి ఉన్న పరపతి కూడా పోతుంది. మా మాట విను. ఇదొక్కసారి చంద్రబాబునే ముందుంచి ఎన్నికలకు వెళ్దాం” అని టీడీపీ సీనియర్లు లోకేశ్‌కు నెత్తీనోరు కొట్టుకుని చెప్పారు. అబ్బే…. తగ్గేదే లే అని పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పెద్దల మాట వినకపోవడం వల్ల ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. పైగా మనోడి వాక్చాతుర్యం అదనపు ఆకర్షణ.
ప్రశాంత అత్త, పందిముట్లు, సైకో రావాలి, సైకిల్ రావాలి తదితర ఆణిముత్యాల్లాంటి మాటలు మాట్లాడుతున్న లోకేశ్‌ను ఒక్కసారైనా చూసి వద్దామని వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే. లోకేశ్ పాదయాత్రకు జనం రాక గురించి చెప్పాలంటే… మనూరికి కమెడియన్ వస్తున్నాడంటే సరదాగా చూసి వద్దామని ఆలోచించే వాళ్లున్నారు. కనీసం జనంలోకి వెళ్లడానికి ముందైనా ఎలా మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలనే ప్రాక్టీస్ చేసినట్టు లేదు. పిండికొద్దీ రొట్టె అంటారు. లోకేశ్ శ్రమకు తగ్గట్టుగానే ఫలితం కూడా వుంటుందనడంలో సందేహం లేదు.