ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అదోఇదో అని మాట్లాడుకునేలోపే ఎన్నికలు వచ్చి పడతాయి. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం.
ఏప్రిల్ నుంచి ఆయన నేరుగా ప్రజలను కలవనున్నారు. వారితో కలిసి పల్లె నిద్ర చేయనున్నారు. ఏప్రిల్ నుంచి బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి మండలంలో ఒకట్రెండు పల్లెలను ఎంచుకుని అక్కడే ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
నాలుగేళ్ల పాలనలో ఎన్నికల మ్యానిఫెస్టో అమలు, మిగిలిపోయిన వాటి అమలుపై ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. నవ రత్నాల పేరుతో ఇచ్చిన సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేశామని, చేస్తామని, మరోసారి ఆశీస్సులు అందజేయాలని ఆయన ప్రజానీకాన్ని కోరనున్నారు.
గతంలో పాదయాత్ర సందర్భంగా బస చేసినట్టుగానే, బస్సు యాత్రలో కూడా అదే రీతిలో ఆయన ప్రజలతోనే గడపనున్నారు. బస్సు యాత్రలో ఎక్కడికక్కడ మకాం వేయనున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, పార్టీలో అసంతృప్తులపై దృష్టి సారించనున్నారు.
ప్రజల వద్దకు వెళ్లే సమయానికి ఆర్థిక పరమైన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా గ్రామస్థాయిలో నాయకులు సొంత డబ్బు ఖర్చు చేసి చిన్నచిన్న పనులు చేసినా, బిల్లులు కాలేదని ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి వాటికి మోక్షం కలిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది.
బస్సుయాత్రలో అనుసరించాల్సిన విధివిధానాలపై జగన్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల టీమ్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఇక అమలే తరువాయి.