ఈ మూడు పేర్లు చాలు..ఓ పాట వినాలి అనే ఆసక్తిని విపరీతంగా జనరేట్ చేయడానికి. సిరివెన్నెల తన పాటల్ని మనకు వదిలి వెళ్లిపోయారు. కానీ ఆయనకు దర్శకుడు కృష్ణవంశీ అంటే ఎంత ప్రేమో సినిమా జనాలకు తెలిసిందే. అందుకే ఆ రుణానుబంధం వున్నట్లుంది..ఓ చివరి పాటను కృష్ణవంశీకి ఇచ్చి మరీ వెళ్లారు.
చిరకాలంగా కృష్ణ వంశీ తీస్తున్న రంగమార్తాండ సినిమా కోసం ఎప్పుడో రాసి వెళ్లారు ఈ పాటను. మ్యూజిక్ మాంత్రికుడు ఇళయరాజా స్వరకల్పన. అసలే సంగీతం అంటే విపరీతమైన అభిమానం, అభిరుచి వున్న దర్శకుడు..ఇళయరాజాకు తోడయితే ఎలాంటి పాట పుడుతుంది. అదే కదా అసలు సిసలు ఆసక్తి.
అలాంటి పాటను ఈ రోజు విడుదల చేసారు. ‘నన్ను నన్నుగా ఉండనీవుగా..ఎందుకంటు..నిందలేవీ వెయ్యలేనుగా’ అంటూ అమ్మాయి పాడే ప్రేమగీతం ఇది. తొలిలైన్ లోనే తన మార్క్ చూపించారు సిరివెన్నెల. అక్కడి నుంచి సాగిన చరణాలు, అక్షర తోరణాలు సిరివెన్నెల మార్కును పాడుతూనే సాగాయి.
ఇలాంటి పాటకు ఇళయరాజా తన స్టయిల్ ట్యూన్ ను అందించారు. ఇనుస్ట్రుమెంటేషన్ కొత్తగా ప్రయత్నించలేదు. అభిమానులకు పరిచయం అయిన ఇళయరాజా వాయిద్య సంచయమే. ట్యూన్ అటు ఫాస్ట్ కాదు. ఇటు స్లో కాదు..అన్నట్లుగా మిడిల్ లో సాగింది. అందువల్ల కొత్తగా అనిపిస్తుంది. సింగర్ రజనీ గాయత్రి స్వరం కొత్తగా, హుషారుగా వుంది.
రంగమార్తాండ సినిమా కు ఇప్పటి వరకు మెగాస్టార్ వాయిస్ ఓవర్, బ్రహ్మానందం డైలాగ్ బిట్ వదిలారు. రెండూ కూడా సినిమా ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సాంగ్ కూడా కచ్చితంగా అదే దారిలో వెళ్తుంది.