కేంద్రం ఈడబ్ల్యుసి కింద అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాలో అయిదు శాతం రిజర్వేషన్ల వెసులుబాటు ఏనాడో కల్పించింది. 2014 నుంచి 19 వరకు అధికారంలో వున్న చంద్రబాబు చాలా తెలివిగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నా అని చెప్పి ఈ అయిదుశాతం వారికి దఖలు పరిచారు.
నిజానికి ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఆంధ్రలో ఆర్థికంగా చాలా కులాల వారు వెనుకబడి వున్నారు. అందులో సందేహం లేదు. అసలు ఆర్థికపరమైన రిజర్వేషన్లే మంచి పద్దతి అనే వాదన కూడా వుంది. దాని సంగతి అలా వుంచితే ఈ అయిదుశాతం కోటాను ఆర్థిక అంశాల ప్రాతిపదికన వాడాల్సి వుంది. కానీ చంద్రబాబు చాలా తెలివిగా ఇది కాపుల వైపు మళ్లించారు. జగన్ వచ్చిన తరువాత ఇది సరి కాదు అని రద్దు చేసారు.
ఇప్పుడు కాపు నాయకుడు హరిరామజోగయ్య ఈ విషయంలో కోర్టుకు ఎక్కారు. కాపులు ఆర్థికంగా వెనుకబడి వున్నారని అందువల్ల వారికి ఆ అయిదు శాతం కేటాయించాలని కోరుతున్నారు. కాపులకు ఓ అయిదు శాతమో, పదిశాతమో రిజర్వేషన్లు కోరవచ్చు. అందులో తప్పులేదు. కానీ ఈడబ్ల్యుసి రిజర్వేషన్లు తమకు ఇవ్వాలని కోరడం కాస్త చిత్రంగానే వుంది. ఇప్పుడు ఈ కోటా కాపులకు ఇచ్చేస్తే అగ్రవర్ణాలు కావచ్చు, ఇతర వర్ణాలు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏమిటి?
అసలు ఈ తరహా రిజర్వేషన్ల రూల్ పొజిషన్ ఏమిటి? కోర్టు పూర్వా పరాలు అన్నీ పరిశీలించి ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్నది ఇప్పుడు చెప్పేది కాదు..డిస్కస్ చేసేది కాదు. కానీ కాపుల ఓట్లు కావాలి, కాపుల అండ కావాలని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. కానీ ఇప్పుడు మిగిలిన కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి రావాల్సిన వాటాను తామే తీసేసుకోవాలనుకుంటున్న కాపులను దగ్గరకు తీసే పార్టీలను మిగతా కులాల వారు ఎలా చూస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
హరిరామజోగయ్య ఇలాంటి సమయంలో ఇలాంటి పిటిషన్ వేయడం కాపుల పార్టీగా ముద్రపడుతున్న జనసేనకు మిగిలిన కులాల వారిని మరింత దూరం చేసే ప్రమాదం అయితే వుంది.