‘మా తాతే గనుక టాటా బిర్లా అయిఉంటేనా?’ అనే తరహా డైలాగును మన సినిమాల్లో రకరకాలుగా.. పురాతన కాలం నుంచి విపరీతంగా వాడేశారు. సాధారణంగా ఈ డైలాగును కమెడియన్ లకు వాడుతుంటారు! ఏమీ చేయడానికి తగిన శక్తి లేని వాడు.. ఈ తరహా డైలాగును వాడుతుంటాడు…! ఇప్పుడు పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు కూడా అంతకంటె భిన్నంగా ఏమీ లేవు.
‘‘నేను ఆరోజు ఆవిధంగా చేసి ఉంటేనా?… వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని అని పవన్ చెప్పుకుంటున్నారు. ఇది అచ్చంగా.. ‘లేస్తే మనిషిని కాను’ అని చెప్పే అసమర్థుడి ప్రేలాపన లాగానే ఉంది.
జానీ సినిమా నాటికి నా రెమ్యునరేషన్ రెండు కోట్లు. అప్పుడే మాదాపూర్లో ఓ 30 ఎకరాలు కొని పడేసి ఉంటే.. ఈ పాటికి వేలకోట్ల అధిపతి అయ్యేవాడిని.. అని పవన్ కల్యాణ్ చెప్పారు. జానీ సినిమా 2003లో వచ్చింది. అప్పటికే అక్కడ హైటెక్ సిటీ గట్రా అన్నీ ఉన్నాయి. అప్పట్లో మాదాపూర్లో ఎకరా 6 లక్షలకు వచ్చేదో లేదో మనకు తెలియదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం లెక్క చెప్పేశారు.
ఆయనకు డబ్బు ఆశ లేదుట! కాబట్టి కొనలేదుట! ఇది మరీ చిత్రంగా ఉంది. డబ్బు ఆశలేకపోతే ఆ రెండు కోట్లను ఏంచేశారు? బీదా బిక్కీకి దానధర్మాలేమైనా చేశారా? అప్పట్లో మాదాపూర్లో భూములు కొనడం కంటె విలువైనది అని ఆయన అప్పటి జ్ఞానానికి అనిపించిన పని ఏదో ఆయన చేసి ఉంటారు! అంతేకదా..! భూమి వ్యాపారం కంటె లాభసాటి అనిపించిన మరో వ్యాపారంలో ఆయన పెట్టి ఉంటాడే తప్ప.. ఆ డబ్బుల్ని ఏ సేవకోసం ప్రజలకోసం ఖర్చు పెట్టాడో వివరణ చెప్పగలడా! ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్నట్లుగా.. ఇలా డబ్బు ఆశ లేదనే డైలాగులు ఎందుకు?
పవన్ కల్యాణ్ నిజమే చెబుతుంటే గనుక.. 2003-04లో ఆయన ఫైల్ చేసిన టాక్స్ రిటర్న్స్ ను కూడా ప్రజలకు చూపించాలి. అందులో జానీ సినిమా రెమ్యునరేషన్ 2 కోట్లుగా చూపించారో.. 20 లక్షలుగా చూపించారో తెలుస్తుంది. ఇప్పుడివాళ డబ్బాశ లేదని, తనను మించిన నిజాయితీపరుడు లేడని ప్రగల్భాలు పలుకుతున్న వ్యక్తి.. ఆరోజు 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని, ప్రభుత్వానికి ఎంత లెక్క చెప్పాడో.. ఎంత పన్ను కట్టాడో కూడా తెలుస్తుంది!
మీరు నిప్పు అని చాటుకోడానికి ఆ పనిచేయండి పవన్ గారూ! అని ప్రజలు అనుకుంటున్నారు.