సీనియర్ మంత్రి కక్కుర్తి.. యువ నేత పంచాయితీ

మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ అవినీతి సొమ్ముకి ఆశపడొద్దు, అక్రమాలకు తావివ్వొద్దు అని సీఎం జగన్ చెబుతూనే ఉన్నా.. కొంతమంది మాత్రం చిలక్కొట్టుడు ఆపలేదు. తాజాగా దీనికి సంబంధించి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. కేబినెట్ లో…

మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ అవినీతి సొమ్ముకి ఆశపడొద్దు, అక్రమాలకు తావివ్వొద్దు అని సీఎం జగన్ చెబుతూనే ఉన్నా.. కొంతమంది మాత్రం చిలక్కొట్టుడు ఆపలేదు. తాజాగా దీనికి సంబంధించి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. కేబినెట్ లో సీనియర్ మంత్రిగా పేరున్న ఓ వ్యక్తి, కాస్త కమీషన్ కు కక్కుర్తిపడ్డారు. ఇది తెలిసిన ఓ యువ మంత్రికి కోపం వచ్చింది. మాటమాట పెరిగింది. జగన్ వరకు వెళ్లకుండా ఇద్దరూ ఓ మాట అనుకొని రాజీకొచ్చారు.

టీడీపీ హయాంలో అభివృద్ధి పనుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో అవినీతి ధారాళంగా జరిగింది. నెల్లూరు మున్సిపాల్టీలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులు జరిగాయి. ప్రధాన కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ నేరుగా అప్పటి తెలుగుదేశం మంత్రులకు ఎలా చేరాయో తెలిసిందే. అలా కాంట్రాక్టులు అందుకున్న వ్యక్తులే గత ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ నాయకులకు ఫండింగ్ ఇచ్చారనే విషయం కూడా తెలిసిందే.

ఇలా అప్పటి టీడీపీ మంత్రుల బినామీలు చాలామంది వర్క్ ఆర్డర్లు లేకుండానే సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేశారు. ఈ పనులు ఇచ్చినందుకు ఎన్నికల్లో తన తరపున ఖర్చు పెట్టుకోవాలని, ప్రచారం చేయాలనేది టీడీపీ కండిషన్. ఆ మేరకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎన్నికలు బాగా కాస్ట్ లీ గా మారాయి. చివరకు వైసీపీదే పైచేయిగా నిలిచింది. అది వేరే విషయం.

అయితే అప్పుడు సబ్-కాంట్రాక్టులుగా పనిచేసిన వాళ్లెవరికీ బిల్లులు క్లియర్ చేయలేదు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులన్నీ పూర్తిగా పెండింగ్ లో పడ్డాయి. దీంతో చాలామంది చోటామోటా నాయకులు లబోదిబోమంటున్నారు. కాంట్రాక్ట్ డబ్బుల కోసం వీరంతా మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అలా ఓ సీనియర్ మంత్రి దగ్గరకు డీల్ వెళ్లింది. ఇతడికి గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. పైగా గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన నారాయణ రికమండేషన్ తో వెళ్లడంతో.. సదరు సీనియర్ మంత్రి ఆ పనిచేసి పెట్టారు, అయితే 50శాతం కమీషన్ తీసుకున్నారట.

మరికొంతమందికి కూడా ఇదే విధంగా ఆ సీనియర్ మంత్రి బిల్లులు చేసి పెట్టబోతున్నారనే విషయం తెలియడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువ నేత రంగంలోకి దిగారు. తన జిల్లా విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని, అందులోనూ గతంలో వారంతా తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇక ఈ విషయంలో ముందుకెళ్లొద్దని కాస్త గట్టిగానే చెప్పారట. సీనియర్ని నాకే ఎదురు చెబుతావా అంటూ సదరు మంత్రి కాస్త ఫీలైనా, మేటర్ సీఎం వరకు వెళ్లడం ఇష్టం లేదు కాబట్టి ఆయన సైలెంట్ అయ్యారు.

అలా ఈ చిలక్కొట్టుడు వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. కమీషన్ పోయినా డబ్బులొస్తాయని ఆశపడ్డ నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు భంగపడ్డారు.