మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. ఇటీవల ఈ రెండు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీ, మండలిలో కూడా ఉపసంహరణ బిల్లులను ఆమోదించారు. అనంతరం హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉపసంహరణ బిల్లులపై విచారణ జరిపింది. ఉపసంహరణ బిల్లుల్లో కూడా మూడు రాజధానులు తీసుకొస్తామని ప్రభుత్వం పేర్కొనడాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్‌పై ప్రభుత్వ తరపు లాయర్లను కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం గవర్నర్ వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. గవర్నర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందువల్లే ఆలస్యమవుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చాకే విచారణ జరుపుతామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజధాని కేసుల విచారణ కారణంగా చట్టానికి లోబడి అభివృద్ధి చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నట్లు ధర్మాసనం తేల్చిచెప్పింది. మరోవైపు.. ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల తరలింపుపై మాత్రం మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. వచ్చే నెల 27కు ధర్మాసనం వాయిదా వేసింది.
అభివృద్ధి పనులపై అడ్డంకి తొలగిపోవడంపై ప్రభుత్వానికి సానుకూలమని, అలాగే ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల తరలింపుపై మద్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పడం రాజధాని రైతులకు సానుకూలమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉభయులకు సగం చొప్పున సంతోషాన్ని ఇస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.