అమ‌రావ‌తి రైతుల‌తో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే

నెల్లూరు మీదుగా పాద‌యాత్ర‌ను సాగిస్తున్న అమ‌రావ‌తి రైతుల‌ను క‌లిసి వారి క్షేమ‌స‌మాచారాల‌ను తెలుసుకుని, త‌న నియోజ‌క‌వ‌ర్గం మీద పాద‌యాత్ర సాగే అన్ని రోజులూ ఏమైనా కావాలంటే త‌న‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని వారికి చెప్పారు నెల్లూరు రూర‌ల్…

నెల్లూరు మీదుగా పాద‌యాత్ర‌ను సాగిస్తున్న అమ‌రావ‌తి రైతుల‌ను క‌లిసి వారి క్షేమ‌స‌మాచారాల‌ను తెలుసుకుని, త‌న నియోజ‌క‌వ‌ర్గం మీద పాద‌యాత్ర సాగే అన్ని రోజులూ ఏమైనా కావాలంటే త‌న‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని వారికి చెప్పారు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. 

తన నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కే కాదు… నెల్లూరు జిల్లా వ‌ర‌కూ కూడా కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి వారికి అన్నీ స‌మ‌కూర్చి పెట్టేలా ఉన్నారు! ఇలా అమ‌రావ‌తి అనుకూల పాద‌యాత్ర‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిదాయ‌కంగా ఉంది.

అయితే తెలుగుదేశం పార్టీ కోరుకునేది ఇది కాదు. అమ‌రావ‌తి పాద‌యాత్ర‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అడ్డు చెప్పాలి, పాద‌యాత్ర‌న పోయే వారిని అడ్డుకోవాలి.. అప్పుడు ర‌చ్చ జ‌ర‌గాలి.. అని తెలుగుదేశం స‌హ‌జంగానే కోరుకుంటుండ‌వ‌చ్చు. అయితే అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెళ్లి వారి క్షేమ స‌మాచారాల‌ను విచారించి, పాద‌యాత్ర‌కు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు.

అయితే పాద‌యాత్రికులు మాత్రం ఆ ఎమ్మెల్యేను ఒక కోరిక కోరార‌ట‌. జై అమ‌రావ‌తి అంటూ త‌మ‌తో పాటు నిన‌దించ‌మ‌ని ఆయ‌న‌ను కోరార‌ట‌. స‌హ‌కారం వ‌ర‌కూ ఓకే కానీ, అలాంటి నినాదాల‌ను మాత్రం కోర‌వ‌ద్ద‌ని ఎమ్మెల్యే సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. 

రాజ‌కీయంగా అమ‌రావ‌తి నినాదానికి తాము దూర‌మే అయినా, పాద‌యాత్ర చేసే వారి స‌దుపాయాల వ‌ర‌కూ బాధ్య‌త తీసుకోవ‌డానికి కూడా రెడీ అని కోటంరెడ్డి మంచి సంకేతాల‌ను పంపించారు. అమ‌రావ‌తి ఉద్య‌మ కారులు ప్ర‌భుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ర‌క‌ర‌కాలుగా శాప‌నార్థాలు పెడుతున్నా… ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం వారితో సాద‌రంగానే వ్య‌వ‌హ‌రించ‌డం మంచి ప‌రిణామం.